ఢిల్లీలో డిసెంబర్ 31న జరిగిన కంఝవాలా కారు ఘటనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 11 మంది పోలీసులను సస్పెండ్ చేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీసీపీ స్థాయి అధికారితో పాటు మరో 10 మందిపై చర్యలు తీసుకుంది. సస్పెండ్ అయిన అధికారులు రోహిణి జిల్లాకు చెందిన పోలీసు అధికారులు కాగా..వీరిలో ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు, నలుగురు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో వీరిలో ఆరుగురు పీసీఆర్ డ్యూటీలో ఉండగా..మరో ఐదుగురు ఘటన జరిగిన రోజు పికెట్ వద్ద ఉన్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఐదుగురిపై హత్యా నేరారోపణలు నమోదు చేయాలని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఢిల్లీ పోలీసులను ఆదేశించంది.
న్యూ ఇయర్ రోజున కంఝవాలాలో స్కూటీపై వెళ్తున్న ఈవెంట్ ప్లానర్ అంజలీ సింగ్‌ను.. కొందరు నిందితులు కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు. అయితే ఈ సమయంలో ఓ వ్యక్తి చూసి పోలీసులకు సమాచారం అందించగా..విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం కొద్ది దూరంలో రోడ్డుపై అంజలీసింగ్ మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై స్పెషల్ కమిషనర్ షాలినీ సింగ్ నేతృత్వంలోని కమిటీ విచారించింది. ఈ కమిటీ సమర్పించిన నివేదికను అనుసరించి కేంద్ర హోంశాఖ..ఈ సమయంలో డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేయాలనిఢిల్లీ పోలీసులను ఆదేశించింది.
మరోవైపు కంఝవాలా ఘటన కేసులో నిందితుల రక్త నమూనా నివేదికను రోహిణి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఢిల్లీ పోలీసులకు ఇవ్వనుంది. ప్రమాదం జరిగిన రాత్రి మద్యం నిందితులు సేవించి ఉన్నారా అనే విషయాన్ని కూడా నివేదికలో స్పష్టం చేసింది. క్రైమ్ సీన్ రిపోర్టును కూడా పోలీసులకు సమర్పించనుంది. ఎఫ్‌ఎస్‌ఎల్ మృతిరాలి విసెరా నివేదికను రోహిణి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అందజేయనుంది.