ఇన్​చార్జి తహసీల్దార్ల బదిలీలపై యూనియన్​ లీడర్​ కన్ను

రూలింగ్​పార్టీకి అనుకూలంగా సర్దుబాటుకు యత్నం

నిజామాబాద్, వెలుగు: రెవెన్యూ శాఖలోని ఎఫ్ఏసీ తహసీల్దార్ల (ఫుల్​అడిషనల్​చార్జ్)​ బదిలీల వ్యవహారంలో చక్రం తిప్పేందుకు ఓ యూనియన్​ లీడర్ ​రంగంలోకి దిగాడు. అతడికి అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత అండదండలు ఉన్నట్లు సమాచారం. అధికారుల కొరత కారణంగా జిల్లాలోని 15 మండలాల్లో డిప్యూటీ తహసీల్దార్లే ఇన్​చార్జి తహసీల్దార్లుగా పనిచేస్తున్నారు. ఎలక్షన్​ కమిషన్ ​నిబంధనలు ఈ హోదాలో పనిచేస్తున్నవారు ఎన్నికల విధులు నిర్వహించడాన్ని ఒప్పుకోవు. దీంతో ఎలక్షన్ ​యాంగిల్​లోనే ఎఫ్​ఏసీ తహసీల్దార్లను సర్దుబాటు చేయనుండగా ఆ వ్యక్తి చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది.

ఆయా మండలాల్లో..

జిల్లాలో మొత్తం 33 మండలాలున్నాయి. అందులో బోధన్, రుద్రూర్, చందూర్,​ సాలూరా, మోస్రా, కమ్మర్​పల్లి, ఎర్గట్ల, వర్ని, మోపాల్, ధర్పల్లి, ఆలూరు, బాల్కొండ, డొంకేశ్వర్, ముప్కాల్ తదితర​ మండలాలకు డిప్యూటీ తహసీల్దార్లే ఇన్​చార్జి తహసీల్దార్లుగా పనిచేస్తున్నారు. వీరు రెండేళ్లకు ఈ విధుల్లో కొనసాగుతున్నారు. ఎలక్షన్ల  టైమ్​లో ప్రతీ నియోజకవర్గానికి రిటర్నింగ్​ ఆఫీసర్​ఉంటారు. అసిస్టెంట్​ రిటర్నింగ్​ ఆఫీసర్లుగా తహసీల్దార్​ కొనసాగుతారు. 

ALSO READ :సౌత్ సెంట్రల్ రైల్వే ఐజీ ప్రిన్సిపల్ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆరోమా సింగ్

అంతటా ట్రాన్స్​ఫర్ల బిజీ..

ఎన్నికలు దగ్గరపడుతున్నందున జిల్లా స్థానికత ఉన్న ఆఫీసర్లను, మూడేళ్లకు మించి ఒక జిల్లాలో పనిచేసిన వారిని కమిషన్​ ఆర్డర్స్ ​ప్రకారం ట్రాన్స్​ఫర్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్​కు ఇతర జిల్లాల నుంచి కొత్త తహసీల్దార్లు రానున్నారు. కాబట్టి ఎఫ్​ఏసీ తహసీల్దార్లను కచ్చితంగా వేరే చోటకు బదిలీ చేస్తారు, లేదంటే ఉన్న చోటే డిప్యూటీ​తహసీల్దార్లుగా కొనసాగాల్సి ఉంటుంది. ఇక్కడ యూనియన్​ లీడర్ ​కీలక రోల్ ​పోషిస్తున్నాడు. వీరిని ఎక్కడెక్కడ నియమించాలనే అంశంపై భారీ కసరత్తు నడుస్తోంది. అతడి సిఫార్సులను ఓకే చేయాలని అధికార పార్టీ ముఖ్యనేత జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

గతంలోనూ..

గత నెలలో గుట్టుచప్పుడు కాకుండా ఆరుగురు తహసీల్దార్ల ట్రాన్స్​ఫర్ చేశారు. ఈ బదిలీల వెనక సదరు యూనియన్ ​లీడర్​హస్తమున్నట్లు సమాచారం. ముగ్గురు తహసీల్దార్లను కలెక్టరేట్ ​సూపరింటెండెంట్లుగా బదిలీ చేయించి, ఆ మండలాల్లోనే తహసీల్దార్లుగా డిప్యుటేషన్​వేయించారు. కలెక్టరేట్​లోని ముగ్గురు సూపరింటెండెట్లను తహసీల్దార్లుగా ట్రాన్స్​ఫర్​ఆర్డర్లు తీయించి, డిప్యూటేషన్​పై కలెక్టరేట్​లోనే కొనసాగేలా చేశాడు. ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్ల ట్రాన్స్​ఫర్లను ఇదే లీడర్​హ్యాండిల్​చేస్తున్నాడు. కొందరిని అసిస్టెంట్​ఎన్​రోల్​మెంట్​ ఆఫీసర్లుగా రూలింగ్​ పార్టీకి అనుకూలంగా వ్యవహరించే చోట నియమిస్తున్నారు.