
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ అయ్యింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం (ఏప్రిల్ 25) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి కీలక సూచనలు చేశారు. ఆయా రాష్ట్రా్ల్లోని పాకిస్థానీయులను గుర్తించి వెంటనే వారిని తిరిగి వెనక్కి పంపాలని ఆదేశించారు. ఇప్పటికే పాకిస్తానీయులకు జారీ చేసిన అన్ని వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.
వారం రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఉన్న పాకిస్తానీయులపై పోలీసులు నజర్ పెట్టారు. సిటీలో ఉన్న పాక్ పౌరుల వివరాలను హైదరాబాద్ సేకరించారు. హైదరాబాద్ లో మొత్తం 208 మంది మంది పాకిస్తానీయులు ఉన్నట్లు సమాచారం. వీరందరిని రెండు రోజుల్లో వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించారు.
జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాం ఏరియా బైసారన్ మైదాన ప్రాంతంలో మంగళవారం (ఏప్రిల్ 22) ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. మినీ స్విట్జర్లాండ్‌గా పిలిచే పహల్గాంకు కుటుంబంతో కలిసి సరదాగా టైమ్ స్పెండ్ చేసేందుకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రమూకలు విచక్షణరహితంగా కాల్పులు జరిపాయి. ముష్కరుల పాశవిక దాడిలో 26 మంది అమాయక ప్రజలు మృతి చెందగా.. మరికొందరు పర్యాటకులు బుల్లెట్ గాయాలకు తీవ్రంగా గాయపడ్డారు.
దీంతో పహల్గాంలో దాడికి పాల్పడిన ముష్కరుల కోసం భారత దళాలు జమ్మూ కాశ్మీర్‌ను అణువణువునా శోధిస్తున్నారు. ఈ దాడి వెనక పాక్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన భారత ప్రభుత్వం దాయాది దేశంతో పూర్తిగా దౌత్య సంబంధాలు తెంచుకుకుంది. ఇందులో భాగంగానే పాక్ పౌరులకు జారీ చేసిన అన్ని రకాల వీసాలను రద్దు చేసి.. వారం రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.