జమ్మూ కాశ్మీర్‎లో ఉగ్రవాదాన్ని పాతిపెడతాం: కేంద్రమంత్రి అమిత్ షా

జమ్మూ కాశ్మీర్‎లో ఉగ్రవాదాన్ని పాతిపెడతాం: కేంద్రమంత్రి అమిత్ షా

జమ్మూ కాశ్మీర్‎లో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. పోలింగ్‎కు సమయం దగ్గరపడుతుంటంతో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రత్యర్థులపై విమర్శల బాణాలు సంధిస్తూ.. ప్రజలకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత  జమ్మూలో జరుగుతోన్న ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇవే కావడంతో అన్ని పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. కాంగ్రెస్, ఎన్సీ పార్టీలు పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతుండగా.. బీజేపీ, పీడీఎఫ్ పార్టీలు ఒంటరిగానే ఎన్నికల సమరానికి సై అంటున్నాయి. దేశ భద్రతకు అత్యంత కీలకమైన జమ్మూ కాశ్మీర్‎లో ఎలాగైనా గెలిచి కాషాయ జెండా రెపరెపలాడించాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. 

ALSO READ | వంద రోజుల పాలన ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందుంది : ప్రధాని మోదీ

ఇందులో భాగంగానే ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా, రాజ్ నాథ్ సింగ్ బీజేపీ అగ్రనేతలు జమ్మూ కాశ్మీర్‎లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు మొత్తం మూడు దశల్లో జరగనుండగా.. ఫస్ట్ ఫేజ్ పోలింగ్ సెప్టెంబర్ 18వ తేదీన జరగనుంది. చీనాబ్ వ్యాలీలోని 21 అసెంబ్లీ స్థానాలకు తొలి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇవాళ (సెప్టెంబర్ 16) జమ్మూ కాశ్మీర్‎లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సుడిగాలి ప్రచారం నిర్వహించారు. మొత్తం మూడు వేర్వేరు బహిరంగ సభల్లో పాల్గొన్న అమిత్ షా.. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) కూటమిపై విరుచుకుపడ్డారు. 

కాంగ్రెస్, ఎన్సీ కూటమి అధికారంలో వస్తే జమ్మూ కాశ్మీర్‎లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోతారని కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్‎కు బీజేపీనే శ్రీరామరక్ష అని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంతత నెలకొందని.. టెర్రరిస్ట్ యాక్టవిటీస్ తగ్గుముఖం పట్టాయన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని పూర్తిగా పాతిపెడతామన్నారు అమిత్ షా. కాగా, జమ్మూ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు విశ్వ ప్రయత్నాలు  చేస్తుండగా.. ప్రజలు మాత్రం ఎవరికీ పట్టం కట్టారో తెలియాలంటే అక్టోబర్ 5వ తేదీ వరకు ఆగాల్సిందే.