తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సి ఉందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. ఆదిలాబాద్‌లో మంగళవారం నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 03న బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. పవిత్ర భూమి ఆదిలాబాద్‌కు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణలో ట్రైబల్ వర్సిటీకి బీఆర్ఎస్ సర్కార్ సహకరించలేదని అమిత్ షా తెలిపారు. గిరిజన వర్సిటీకి కేసీఆర్ సర్కారు జాగా చూపించలేదని.. ఆందుకే ఆలస్యమైందని చెప్పారు. పసుపుబోర్డు, కృష్ణ ట్రిబ్యునల్ మోదీ ఘనతేనని చెప్పారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రైతులకు, ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నంబర్ వన్ గా ఉందని ఇది దురదృష్టకరమని చెప్పారు. ఆదివాసులను కేసీఆర్ పట్టి్ంచుకోలేదన్న అమిత్ షా.. మోదీ ప్రభుత్వం రూ. 9 కోట్లు కేటాయించిందని చెప్పారు.
ఎన్నికల హామీలను కేసీఆర్ విస్మరించాడని అమిత్ షా ఆరోపించారు. కేవలం కేటీఆర్ ను ఎలా సీఎంను చేయాలనే కేసీఆర్ పదేళ్లుగా ఆలోచిస్తున్నారని అన్నారు. కేసీఆర్ అంబాసిడర్ స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందని అమిత్ షా విమర్శించారు. మజ్లిస్ కనుసన్నుల్లో నడిచే బిఆర్ఎస్ ను పీకి పారేసి మోడీ నేతృత్వంలోని బిజేపి కి పట్టం కట్టండని ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ సీఎం అవుతాడని, బీజేపీ వస్తే ఆదివాసీ బిడ్డలకు కొలువులు వస్తాయని తెలిపారు.