బెంగాల్‎లో బీజేపీ గెలిస్తే.. బంగ్లా నుండి వలసలు బంద్: కేంద్రమంత్రి అమిత్ షా

బెంగాల్‎లో బీజేపీ గెలిస్తే.. బంగ్లా నుండి వలసలు బంద్: కేంద్రమంత్రి అమిత్ షా

కోల్‎కతా: పశ్చిమ బెంగాల్‎లో బీజేపీ అధికారంలోకి వస్తే బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసలను నిలువరిస్తామని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం (అక్టోబర్ 27) అమిత్ షా భారత్-బంగ్లా సరిహద్దు ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా పెట్రాపోల్ ల్యాండ్ పోర్టు వద్ద కొత్త భవనం, కార్గో గేటును ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శలు గుప్పించారు. బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసలు ఆగిపోతేనే బెంగాల్లో శాంతి సాధ్యమని.. ఇలా జరగాలంటే బెంగాల్‎లో బీజేపీ అధికారంలోకి రావాలని  పునరుద్ఘాటించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో బెంగాల్‎కు రూ.2 లక్షల 9 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని.. అదే నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం 2014 నుండి 2024 వరకు పదేళ్లలో 7 లక్షల 74 వేల కోట్ల  రూపాయిలు ఇచ్చిందని గుర్తు చేశారు.

ALSO READ | చట్టంలో మార్పులు చేస్తున్నాం..ఫేక్ కాల్ చేస్తే ఇక అంతే: మంత్రి రామ్మోహన్ నాయుడు

మోడీ ప్రభుత్వం డబ్బులు ఇస్తే ఇక్కడి ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇస్తున్నా. మంచి రోజులు ఎంతో దూరం లేవు.2026 బెంగాల్ శాసన సభ ఎన్నికల తర్వాత ఇక్కడ మంచి రోజులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. బెంగాళ్ ప్రభుత్వం ఓట్ల కోసం అక్రమ వలసలను ప్రోత్సహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.