దేశంలోనే నెంబర్ వన్ అవినీతి పొలిటిషియన్ కేజ్రీవాల్: అమిత్ షా

న్యూఢిల్లీ: ఆప్ అధినేత కేజ్రీవాల్ దేశంలోనే అత్యంత అవినీతి పొలిటిషియన్ అని కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఢిల్లీలోని జేఎల్‌ఎన్ స్టేడియంలో బీజేపీ "జుగ్గీ బస్తీ ప్రధాన్ సమ్మేళనం" కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ మాట్లాడుతూ కేజ్రీవాల్‎పై విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ ఢిల్లీకి మాత్రమే కాదు ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా ఆపదేనని ఎద్దేవా చేశారు. కేజ్రీవాల్‌కు ఒక చెడ్డ రాజకీయ నాయకుడిగా ఉండే అన్ని లోపాలు ఉన్నాయని..  దేశంలోనే నంబర్‌వన్ అవినీతి నాయకుడిగా ఆయన నిలిచారని విమర్శల వర్షం కురిపించారు. అవినీతికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన వ్యక్తులు అవినీతి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టారని సెటైర్ వేశారు.

‘‘భంగపడిన వాగ్దానాలకు వ్యతిరేకంగా మురికివాడల ప్రజల బాధలను, అసౌకర్యాన్ని, ఆగ్రహాన్ని బీజేపీ విన్నది.. మీ సమస్యలన్నింటినీ జాబితా చేసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, ప్రధాని మోదీకి అందించింది.. మా మేనిఫెస్టో మీకు ఉపశమనం కలిగిస్తుంది” అని ఢిల్లీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 5వ తేదీ మీకు ‘ఆప్-దా’ నుంచి ఉపశమనం లభిస్తోందని అమిత్ అన్నారు. ఢిల్లీ మురికివాడల వాసులు అరవింద్ కేజ్రీవాల్ 'థగ్ రాజ్'కు ముగింపు పలుకుతారని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజల డబ్బును ఉపయోగించి 'షీష్ మహల్' నిర్మించుకుని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న కేజ్రీవాల్ వైఫల్యం వల్ల ప్రజలు మురికి మురికివాడలలో నివసించవలసి వస్తుందని ఫైర్ అయ్యారు. గౌరవప్రదమైన జీవితం, పక్కా ఇల్లు వంటి ప్రజల కలలను మోడీ ప్రభుత్వం నెరవేరుస్తోందని హామీ ఇచ్చారు.