కేంద్రమంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలి: ఎంపీ వంశీ

కేంద్రమంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలి: ఎంపీ వంశీ

పెద్దపల్లి: దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ పని అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ విమర్శించారు. భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్‎పై పార్లమెంట్‎లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం (డిసెంబర్ 24) పెద్దపల్లిలో కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీ మాట్లాడుతూ.. డా.బీఆర్ అంబేద్కర్‎ను అమిత్ షా అవమానించారు.  యావత్ దేశ ప్రజలకు అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులను అమిత్ షా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దళితుల కోసం అంబేద్కర్ నిరంతరం తపించారు.. రాజ్యాంగంలో దళితులకు రిజర్వేషన్లు కల్పించారు. అలాంటి వ్యక్తిపై అమిత్ షా అక్కసు వెళ్లగక్కాడని మండిపడ్డారు. అంబేద్కర్ మనుస్మృతిని తీవ్రంగా వ్యతిరేకించారు.. అన్ని వర్గాల కోసం ఆయన కృషి చేశారని గుర్తు చేశారు. అంబేద్కర్‎ను అవమానించిన అమిత్ షా..  దళితులపై ఎన్ని దాడులు జరిగిన మాట్లాడరని ఫైర్ అయ్యారు. పెద్దపల్లితో దివంగత కాకాది విడదీయలేని బంధమని.. పెద్దపల్లి అభివృద్ధి కోసం కాకా నిరంతరం కృషి చేశారని అన్నారు. నష్టాల్లో ఉన్న సింగరేణికి నిధులు ఇచ్చి కాకా ఆ సంస్థను కాపాడారని గుర్తు చేశారు. 

ALSO READ మాజీ వీసీలపై విజిలెన్స్ ఎంక్వైరీ ముందుకు సాగట్లేదు.. శాతవాహనలో రూ.35 కోట్ల పక్కదారిపై తేలని లెక్క

పెద్దపల్లి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‎లో మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటులో అంబేద్కర్‎పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ రికార్డుల నుండి అమిత్ షా వ్యాఖ్యలు తొలగించాలని కోరారు. కేంద్రమంత్రి అమిత్ షా బేషరతుగా దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మణిపూర్ అంశంపై అమిత్ షా స్పందించి ఇరువార్గాల మధ్య శాంతి నెలకొల్పాలన్నారు. 

బీజేపీ నిజ స్వరూపం ఎన్నికలకు ముందు ప్రజలకు తెలిస్తే దేశంలో నలభై సీట్ల కంటే ఎక్కువ గెలిచేది కాదని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలు ఉన్న పెద్దపల్లి కలెక్టరేట్లో కాక వర్ధంతి వేడుకలు నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనతో కాకానే కాకుండా యావత్ దళిత జాతినే అవమానపరిచినట్లుగా భావిస్తున్నామని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఎంపీగా నాకు ప్రోటోకాల్ పాటించడం లేదని.. అధికారిక ప్రోగ్రాములకు కూడా పిలవడం లేదని ఎంపీ వంశీ అసహనం వ్యక్తం చేశారు.