రాంచీ: కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370ని మళ్లీ తెచ్చేందుకు ప్రయత్నిస్తామన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారు. ‘‘కాశ్మీర్ ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమే. ఆర్టికల్ 370ని మీరు (రాహుల్ గాంధీ) కాదు కదా.. మీ నాలుగో తరం కూడా తిరిగి తీసుకురాలేదు” అని షా హెచ్చరించారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లను సైతం అమలు చేయనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. శనివారం జార్ఖండ్ లోని పలాములో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.
ఓబీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని ఆరోపించారు. ఓబీసీలు, దళితులు, గిరిజనుల రిజర్వేషన్లను తస్కరించి ముస్లింలకు వాటిని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తున్నదని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్రలో కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ నేతలను ఉలేమా లీడర్లు కలిసినపుడు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని వారికి హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. అలాంటి రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయనివ్వబోమని స్పష్టం చేశారు.
‘‘మూడు రోజుల కిందే రాహుల్ రాజ్యాంగ కాపీని చూపించాడు. ఎవరో ఒకరికి ఆ కాపీ ఇచ్చారు. అయితే, ఆ కాపీ కవర్ పేజీపై ఎలాంటి కంటెంట్ లేదు. రాజ్యాంగాన్ని అవహేళన చేయవద్దు. అది మన దేశ విశ్వాసానికి సంబంధించిన విషయం. ఏటా నవంబరు 26న రాజ్యాంగ దినం పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు’’ అని షా పేర్కొన్నారు.
హేమంత్ సర్కారు అత్యంత అవినీతిమయం
దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం హేమంత్ సోరెన్ సర్కారే అని అమిత్ షా ఫైర్ అయ్యారు. సోరెన్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన నేతలను తలకిందులుగా వేలాడదీస్తామని హెచ్చరించారు. కాగా.. 81 సీట్లున్న జార్ఖండ్ అసెంబ్లీకి ఈనెల 13, 20న రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇదే నెల 23న కౌంటింగ్ జరగనుంది.