కేంద్ర హోం మంత్రి అమిత్ షా జనవరి 28న తెలంగాణలో పర్యటించనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్ల గెలుపే లక్ష్యంగా ఆయన పర్యటన సాగనుంది. అందులో భాగంగా కరీంనగర్ లోని ఎస్సారార్ కాలేజ్ ప్రాంగణంలో జరిగే పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనంలో ఆయన పాల్పొననున్నారు. ఈ సందర్భంగా ఎస్సారార్ కాలేజ్ మైదానంలో ఏర్పాట్లను బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అక్కడి అధికారులకు సూచించారు.
అనంతరం హైదరాబాద్ పార్లమెంట్ క్లస్టర్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని మేధావుల సమావేశంలో పాల్గొంటారు. మిగిలిన రెండు క్లస్టర్ల మీటింగ్ లు వచ్చే నెలలో జరగనున్నాయి. వాటికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇది వరకు ప్రకటించిన ప్రధాని మోదీ రెండు సభలు రద్దయ్యాయి. వాటి స్థానంలో అమిత్ షా క్లస్టర్ మీటింగ్ లు ఖరారయ్యాయి.