తిరువనంతపురం: జర్నలిస్టులకు కేంద్ర మంత్రి, యాక్టర్ సురేష్ గోపి బిగ్ షాక్ ఇచ్చారు. త్రిసూర్‌లోని రామనిలయం ప్రభుత్వ అతిథి గృహం నుండి పని ముగించుకుని వెళ్తున్న తనను కొందరు జర్నలిస్టులు బలవంతగా అడ్డుకున్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి సురేష్ గోపి కంప్లైంట్ మేరకు పోలీసులు పలువురు జర్నలిస్టులపై భారత న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 329(3), 126(2), 132 సెక్షన్ల కింద బుధవారం రాత్రి కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
కేంద్ర మంత్రిని కారులోకి వెళ్లకుండా బలవంతంగా అడ్డుకుని ఆయన విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అతిక్రమణ, తప్పుడు సంయమనంతో వ్యవహరించారన్న ఆరోపణలపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, కేరళ సినీ ఇండస్ట్రీని జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ షేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. పలువురు మహిళా నటులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని జస్టిస్ హేమ కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక కోలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోంది.
మలయాళ స్టార్ యాక్టర్స్ సిద్ధికి, ముకేష్ వంటి నటులు మహిళా ఆర్టిస్టులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు జస్టిస్ హేమ కమిటీ నిర్ధారించడం సంచలనంగా మారింది. ఇదే అంశంపై మంగళవారం త్రిసూర్ వచ్చిన కేంద్ర మంత్రి సురేష్ గోపిని పలువురు జర్నలిస్టులు ప్రశ్నించారు. ఈ సమయంలో జర్నలిస్టుల తీరుపై గోపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వారిని పక్కకు నెట్టుకుంటూ వెళ్లారు. జర్నలిస్టులు బలవంతంగా అడ్డుకుని తన విధులకు ఆటంకం కలింగించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పలువురు జర్నలిస్టులపై కేసు నమోదు చేశారు.