కల్వకుంట్ల ప్రభుత్వాన్ని ఫామ్​హౌస్‌కే పరిమితం చేస్తం : కిషన్ రెడ్డి

బీఆర్ఎస్, కాంగ్రెస్‌ డీఎన్‌ఏ ఒక్కటే: కిషన్‌రెడ్డి

  • కల్వకుంట్ల ప్రభుత్వాన్ని ఫామ్​హౌస్‌కే పరిమితం చేస్తం
  • లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్ట్ సీబీఐ చూసుకుంటది 
  • కాంగ్రెస్‌, బీఆర్‌‌ఎస్‌తో ఎప్పటికీ కలవబోమని స్పష్టీకరణ
  • హనుమకొండలో ప్రధాని మోదీ సభ ఏర్పాట్ల పరిశీలన

హనుమకొండ / వరంగల్, వెలుగు : బీఆర్ఎస్‌‌, కాంగ్రెస్‌‌తో బీజేపీ ఎప్పటికీ కలవబోదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ రెండు పార్టీలు బొమ్మా బొరుసులాంటివని, వాటి డీఎన్ఏ ఒక్కటేనన్నారు. కేసీఆర్‌‌‌‌ది పర్సంటేజీల ప్రభుత్వమని, అన్ని రంగాల్లో కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో కల్వకుంట్ల పాలనకు చరమగీతం పాడేందుకే రాష్ట్రానికి మోదీ వస్తున్నారని ఆయన తెలిపారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌‌లో నిర్వహించనున్న ప్రధాని మోదీ ‘విజయ సంకల్ప సభ’ఏర్పాట్లను శుక్రవారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఇతర నేతలతో కలిసి కిషన్‌‌రెడ్డి పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇదివరకే పొత్తుపెట్టుకున్నాయని, మంత్రి పదవులు కూడా పంచుకున్నాయని గుర్తుచేశారు. రాష్ట్రపతి ఎన్నిక సమయంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని, బీజేపీ మద్దతిచ్చిన ద్రౌపది ముర్ముకు ఇక్కడి నేతలు వ్యతిరేకంగా ప్రచారం చేశారన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ నేతృత్వంలో తెలంగాణలో మంచి పాలనను అందిస్తామని, తమ ప్రభుత్వంలో సీఎం నివాసం ప్రజల కోసమే పని చేస్తుందని చెప్పారు. మహిళలకు భద్రత కల్పించే, ఉద్యమ ఆకాంక్షలకు తగ్గట్టుగా, కుటుంబ వాటాలు లేని పరిపాలనను అందిస్తామని పేర్కొన్నారు. 

కాజీపేటలో రైల్వే పీవోహెచ్ వర్క్ షాప్ ఏర్పాటు చేయాలనుకున్నామని, కానీ కీలకమైన టర్మినల్ కావడంతో వ్యాగన్ తయారీ వర్క్‌‌షాప్‌‌ నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కిషన్ రెడ్డి తెలిపారు. దశలవారీగా రైల్వేకు కావాల్సిన అన్ని ఉత్పత్తులు ఇక్కడే తయారు చేసేలా ప్రభుత్వం నిర్ణయించిందని, భవిష్యత్తులో కోచ్‌‌లు, ఇంజిన్లతో పాటు ఎంటైర్‌‌‌‌ రైలు కూడా తయారయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వరంగల్ ట్రై సిటీకి ఈ ప్రాజెక్టు రావడం అదృష్టమని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో ఏ వివక్ష లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు అంకితభావంతో కేంద్రం పని చేస్తోందన్నారు. 

ఇప్పటికే వరంగల్ టెక్స్ టైల్ పార్క్ మంజూరు చేశామని, ఆ తర్వాతే రెండు కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని చెప్పారు. రాష్ట్రానికి ఇంకా అనేక బహుళ జాతి కంపెనీలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మామునూరు ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ స్థలం విషయంలో చాలా సార్లు రాష్ట్రానికి లేఖలు రాశానని, అయినా స్పందన లేదన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాగానే వరంగల్ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌కు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామన్నారు. మోదీ పాలనలో దేశం పెట్టుబడులకు కేరాఫ్‌‌ అడ్రస్‌‌గా మారిందని తెలిపారు. 

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ విషయం బీజేపీది కాదని, అది సీబీఐ చూసుకోవాల్సిన పని అని అన్నారు. ఎవరిని అరెస్ట్ చేయాలో.. ఎవరిని చేయకూడదో బీజేపీ చేతుల్లో ఉండదని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, పార్టీ జిల్లా ఇన్‌‌చార్జి మురళీధర్ గౌడ్, జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు ఏనుగుల రాకేశ్ రెడ్డి, చందుపట్ల కీర్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వరంగల్​లో నిర్వహించే సభ రాజకీయంగా చాలా కీలకమైంది. కుటుంబ పాలనపై ఏ విధంగా పోరాటం చేస్తున్నామో ఈ సభలో ప్రధాని వివరిస్తారు. కుటుంబ పాలన కారణంగానే దేశంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ లీడర్లు రియల్ ఎస్టేట్, ఇసుక, భూ దందాలతో దోచుకుంటున్నారు. కల్వకుంట్ల ప్రభుత్వాన్ని ఫామ్‌‌హౌస్‌‌కే పరిమితం చేస్తాం.

- కిషన్​రెడ్డి, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు