
- మేడిగడ్డ బ్యారేజ్ కుంగితే సీఎం ఎందుకు స్పందిస్తలే..
హనుమకొండ, వెలుగు : కాళేశ్వరం ప్రపంచంలోనే అత్యంత ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోతే తనకే మాత్రం సంబంధం లేదన్నట్లు ప్రవర్తిస్తున్నారని, సీఎం ఎందుకు స్పందించడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హనుమకొండ హంటర్ రోడ్డులో వరంగల్ వెస్ట్ క్యాండిడేట్ రావు పద్మ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ కుటుంబ పార్టీలే అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని, మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని రూ. 5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల అవినీతి చేశారని ఆరోపించారు. లిక్కర్ దోషులకు శిక్ష తప్పదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అవినీతికి కేరాఫ్‌గా మారాయని, బీఆర్‌ఎస్ అవినీతి ఢిల్లీని తాకిందన్నారు.
తెలంగాణ బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధిస్తుందని, బీసీని సీఎం చేసి మాట నిలబెట్టుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ ప్రభారి మురళీధర్‌గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు సదానందంగౌడ్, సంతోశ్‌రెడ్డి, మీడియా సెంటర్ ఇన్‌చార్జి మాచర్ల కుమారస్వామిగౌడ్, కార్పొరేటర్ వసంత పాల్గొన్నారు.