రేవంత్, కేటీఆర్ జాన్ జబ్బలు : కేంద్ర మంత్రి బండి సంజయ్

రేవంత్, కేటీఆర్ జాన్ జబ్బలు : కేంద్ర మంత్రి బండి సంజయ్
  • వాళ్లిద్దరూ కలిసే రాష్ట్రాన్ని దోచుకుంటున్నరు: కేంద్ర మంత్రి బండి సంజయ్ 
  • కేటీఆర్ జైలుకు వెళ్లకుండా కాపాడుతున్నదే సీఎం
  • ప్రతిఫలంగా భూదోపిడీ, అవినీతికి కేటీఆర్ సహకారం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అపవిత్ర పొత్తులు కొనసాగుతున్నాయని, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాన్ జబ్బలుగామారారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. దీంట్లో భాగంగానే బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాల కేసుల్లో కేసీఆర్ కుటుంబం అరెస్ట్ కాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఆ కేసులను నీరుగారుస్తున్నదని చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి, విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు, ధరణి భూముల కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్, ఫామ్​హౌస్ డ్రగ్స్ కేసు వంటి వాటిలో కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డే మొదట్లో మాట్లాడారని గుర్తుచేశారు. అయితే, కేటీఆర్ తో కుమ్మక్కైన తరువాత ఆ కేసులను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దానికి ప్రతిఫలంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో కలిసి భూముల దోపిడీకి, అవినీతికి కేటీఆర్ సహకరిస్తున్నారని ఆరోపించారు. 

సీబీఐ విచారణ కోరే దమ్ముందా?

హెచ్​సీయూ భూములను అమ్మడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తుంటే.. పైకి గొడవ చేసినట్టు నటిస్తున్నా లోలోపల కేటీఆర్ పూర్తి సహకారం అందిస్తున్నారని సంజయ్​ అన్నారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ రహస్య మైత్రి ఎన్నడో బట్టబయలైందని, ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ మీటింగ్​కు ఇద్దరూ కలిసే వెళ్లారని గుర్తుచేశారు. హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీ చేయకుండా మజ్లిస్​ను గెలిపించేందుకు సహకరిస్తున్నది రేవంత్ రెడ్డి, కేటీఆర్ లేనని ఆరోపించారు. 

హెచ్​సీయూ భూముల వ్యవహారంపై రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ కోరుతూ లేఖ రాయాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణతో హెచ్​సీయూ భూములను దోచుకునేందుకు ఎవరు కుట్రలు చేస్తున్నారు? వారికి ఎవరు సహకరిస్తున్నారు?అనే విషయాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు. హెచ్​సీయూ భూముల వ్యవహారంపై సీబీఐ విచారణ చేయించే దమ్ము కాంగ్రెస్​కు, విచారణకు డిమాండ్ చేసే దమ్ము బీఆర్ఎస్​కు ఉందా? తేల్చుకోవాలని చెప్పారు.