
- దక్షిణాదిలో కేంద్రాన్ని బద్నాం చేయాలని చూస్తున్నరు: బండి సంజయ్
- జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలో భాగం
- తెలంగాణ డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని వ్యాఖ్య
కరీంనగర్, వెలుగు: డీలిమిటేషన్‌పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అలాంటప్పుడు దక్షిణాదికి అన్యాయం చేసినట్టు ఎట్లయితదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. తమిళనాడులో డీఎంకే, కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాల పరిస్థితి దారుణంగా ఉందని, అక్కడి ప్రజలు ఆ ప్రభుత్వాలను అసహ్యించుకుంటున్నారన్నారు. అందుకే లేని సమస్యలను సృష్టించి కేంద్రాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. శనివారం కరీంనగర్‌లో సంజయ్ మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ నిర్ణయం కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలో భాగమేనన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆ 2 పార్టీలకు దిక్కుతోచట్లేదన్నారు. ఎవరు అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ పెద్దలతో బీజేపీ నేతలు రహస్య భేటీ అవుతారన్న రాజాసింగ్ వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా.. రాజాసింగ్ వ్యాఖ్యలు తాను వినలేదని బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే రహస్య భేటీలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి బీజేపీని బద్నాం చేసే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
కేంద్రం వివిధ పథకాలకు నిధులు ఇస్తున్నా.. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం లేదని ప్రచారం చేయడం సరికాదన్నారు. హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని, వీటిపై ఎలాంటి చర్యలు చేపట్టని ప్రభుత్వం.. మిస్ వరల్డ్, తబ్లిగీ జమాతే సంస్థల సమావేశాల పేరుతో వందల కోట్లు ఖర్చు పెడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, డ్రగ్స్ దందాపై ఉక్కు పాదం మోపాలని పోలీసులను కోరారు.