- అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకే అల్లు అర్జున్ అరెస్ట్: కేంద్ర మంత్రి బండి సంజయ్
న్యూఢిల్లీ/హైదరాబాద్, వెలుగు: సంధ్య థియే టర్ వద్ద తొక్కిసలాట ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ ఫెయిల్యూరే కారణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని.. అయితే, ఈ విషయంలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ చేతగానితనాన్ని కప్పి పుచ్చుకునేందుకే అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. శుక్రవారం అల్లు అర్జున్ అరెస్ట్ పై ఎక్స్ వేదికగా సంజయ్ స్పందించారు. ‘‘పుష్ప 2 పాన్ ఇండియా సినిమా అని ప్రపంచమంతా తెలుసు.. సినిమా ఓపెనింగ్ రోజు అగ్రహీరోలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు రావడం 50 ఏండ్లుగా జరుగుతున్న విషయమే.
ఇది తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకు ముందస్తు ఏర్పాట్లు చేయలేదు’’ అని సంజయ్ ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి అమాయక మహిళ బలైతే ఇతరులపై తప్పును నెట్టి శిక్షించాలనుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. ‘‘అల్లు అర్జున్ జాతీయ అవార్డు గ్రహీత.. బట్టలు మార్చుకోవడానికి కూడా ఆయనకు సమయం ఇవ్వకుండా బెడ్రూంలోకి వెళ్లి అరెస్ట్ చేయడం సిగ్గుచేటు’’అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారపార్టీకి పాలనాదక్షత శూన్యమని, నాటకాలు మాత్రం అధికమని సంజయ్ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని దోచుతిన్న వాళ్లు దర్జాగా తిరుగుతుంటే.. జాతీయ అవార్డు గ్రహీత అయిన నటుడిని మాత్రం అరెస్ట్ చేశారని విమర్శించారు.