కమీషన్ ఇస్తేనే బిల్లులు పాస్ అవుతున్నయ్ : మంత్రి బండి సంజయ్​ 

కమీషన్ ఇస్తేనే బిల్లులు పాస్ అవుతున్నయ్ : మంత్రి బండి సంజయ్​ 
  • రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్​ ఆరోపణ     

కామారెడ్డి​, వెలుగు :  రాష్ర్ట ప్రభుత్వంలో  కేవలం ఐదుగురు మంత్రులకు న్యాయం జరుగుతుందని, 15 శాతం కమీషన్ ఇస్తేనే బిల్లులు పాస్ అవుతున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్​ ఆరోపించారు. తమ పనులు కావట్లేదని కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నారన్నారు.  కరీంనగర్ గ్రాడ్యుయేట్, టీచర్​ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా శనివారం సాయంత్రం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని  బృందావన్ ​గార్డెన్ లో నిర్వహించిన మీటింగ్ లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో మేధావి వర్గం ఇచ్చే తీర్పుపై దేశమంతా ఎదురుచూస్తోందన్నారు. ప్రజలకు తప్పుడు సంకేతాలు పోకుండా, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరా రు.

గత బీఆర్​ఎస్​ హయాంలో నిరుద్యోగులు, ఉద్యోగులు,  టీచర్లు, రైతులు సమస్యలపై పోరాటం చేశామన్నారు. ఫామ్​హౌజ్​లో ఉన్న కేసీఆర్​ను బజార్​లోకి తెచ్చామన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై చాలా మందిపై 30 , 40 కేసులు ఉన్నాయని, దెబ్బలు తిన్నారన్నారు.  కాంగ్రెస్​ లీడర్లపై ఎలాంటి కేసులు లేవన్నారు.  ప్రజలు మాత్రం ఆ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారన్నారు.  టీచర్​ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.  సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి, పార్టీ జిల్లా ప్రెసిడెంట్​ నీలం చిన్నరాజులు,  మాజీ ఎమ్మెల్యేలు అరుణతార, వీవీఎస్ఎన్​ప్రభాకర్, మాజీ ఎంపీ బీబీపాటిల్ తదితరులు పాల్గొన్నారు.