
- వాళ్లంతా లిక్కర్ దందాలో దొరికినోళ్లే: కేంద్ర మంత్రి బండి సంజయ్
- స్కామ్‌ల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే డీలిమిటేషన్ పేరుతో డ్రామాలు
- కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని మరోసారి రుజువైందని కామెంట్
కరీంనగర్, వెలుగు: డీలిమిటేషన్ పేరుతో చెన్నైలో స్టాలిన్ అధ్యక్షతన జరిగింది దొంగల ముఠా సమావేశమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆ సమావేశంలో పాల్గొన్న పార్టీల్లోని నాయకులందరూ లిక్కర్ దందాలో దొరికినోళ్లేనని, స్టాలిన్ సర్కార్ కూడా రూ.వెయ్యి కోట్ల లిక్కర్ స్కామ్‌కు పాల్పడిందని విమర్శించారు. శనివారం కరీంనగర్ లోని చామనపల్లిలో దెబ్బతిన్న పంటలను బండి సంజయ్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దోచుకున్నది దాచుకోవడానికి, అవినీతి స్కామ్‌ల నుంచి ఎలా బయటపడాలన్నదానిపై చర్చించుకునేందుకే డీఎంకే ఆధ్వర్యంలో చైన్నైలో మీటింగ్ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
డీలిమిటేషన్‌తో దక్షిణాదిలో సీట్లు తగ్గే ప్రసక్తే ఉండదని పార్లమెంట్లో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేసిన విషయాన్ని సంజయ్ గుర్తు చేశారు. పదేండ్ల పాలనలో చేసిన అవినీతి, స్కామ్ ల నుంచి తప్పించుకునేందుకే బీఆర్ఎస్ .. కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నదన్నారు. కేసీఆర్ కుటుంబంపై ఉన్న అవినీతి కేసులను కాంగ్రెస్ సర్కారు నీరుగారుస్తున్నదన్నారు.ఆ రెండు పార్టీలు ఒక్కటేనన్న విషయం మరోసారి రుజువైందన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టబోతున్నానంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, తాను రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేనని స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్.. ఫాంహౌజ్ లో గడ్డి పీకుతున్నారని ఎద్దేవా చేశారు. అకాల వర్షాలతో రైతులకు తీరని నష్టం జరిగిందని, తక్షణమే పంట నష్టంపై అంచనా వేసి నివేదిక ఇవ్వాలన్నారు. రైతులకు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.