
హైదరాబాద్, వెలుగు: వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా మజ్లిస్ పార్టీ హైదరాబాద్లో నిర్వహించబోయే బహిరంగ సభకు రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్థిక సహకారం అందిస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సభలు, సమావేశాలు, ఆందోళనల పేరుతో అల్లర్లకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే జరిగితే హైదరాబాద్లో బెంగాల్ తరహా పరిస్థితులు ఉత్పన్నమవుతాయన్నారు. వెంటనే కట్టడి చేయాల్సిన అవసరం ఉందని, లేనిపక్షంలో జరగబోయే పరిణామాలకు రేవంత్ రెడ్డి సర్కారే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో బీజేపీకి ఏం సంబంధమని సంజయ్ప్రశ్నించారు. ఆ పత్రిక ఆస్తులను కాజేసేందుకు యంగ్ ఇండియా ట్రస్ట్ పేరుతో డూప్లికేట్ గాంధీ కుటుంబం కుట్ర చేసిందని ఆరోపించారు. పత్రిక ఆస్తులను వ్యక్తిగత ఆస్తులుగా మార్చుకునేందుకు చేసిన కుట్ర కోణంపై 2012లో కేసు వేశారని.. దీనిపై 2013లో కోర్టు నోటీసులు జారీ చేసిందని గుర్తుచేశారు.
సీబీఐ విచారణకు ఆదేశించిందని, అరెస్ట్ కాకుండా బెయిల్పై ఉన్న నిందితులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అని సంజయ్ చెప్పారు. నేషనల్ హెరాల్డ్ పత్రికలో 5 వేల మంది స్వాతంత్ర్య సమరయోధులు వాటాదారులుగా ఉన్నారని, ఆ ఆస్తుల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు సైతం వాటా ఉందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలంతా ధర్నా చేయాల్సింది ఈడీ ఆఫీస్ ముందు కాదని.. ఆ ఆస్తులను కాజేసేందుకు కుట్ర చేసిన సోనియా గాంధీ ఇంటి ఎదుట అని సూచించారు.
వక్ఫ్ ఆస్తుల సొమ్మును ఏం చేస్తున్నరు?
సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ (సీడబ్ల్యూసీ) నివేదిక ప్రకారం దేశంలో 8 లక్షల ఎకరాలకుపైగా వక్ఫ్ ఆస్తులున్నాయని, వీటి విలువ రూ.10 లక్షల కోట్లకు పైగానేనని సంజయ్ చెప్పారు. వీటిపై ఏటా రూ.12 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తోందని, ఆ సొమ్ము ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ముస్లింలలో కోట్ల మంది పేదలున్నారని.. కనీసం వాళ్ల ప్రయోజనాల కోసం కూడా ఖర్చు చేయడం లేదని అన్నారు. ఆ సొమ్మునంతా బడా ముస్లింలు, ఎంఐఎం నాయకులు, ఒవైసీ కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు.
అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలోనూ 77 వేల ఎకరాల వక్ఫ్ ల్యాండ్స్ ఉన్నాయని.. వీటిలో కేవలం 20 శాతం అంటే 16 వేల ఎకరాల భూములు మాత్రమే దర్గాలు, మసీదుల ఆధీనంలో ఉన్నాయని బండి సంజయ్ చెప్పారు. మిగిలిన 80% ల్యాండ్స్ ను ఒవైసీ లాంటి వారు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి దమ్ముంటే వక్ఫ్ ఆస్తులపై హైడ్రాతో సర్వే చేయించాలని సంజయ్డిమాండ్చేశారు.
అలాగే, సీఎం రేవంత్ జపాన్ టూర్పైనా సంజయ్ స్పందించారు. దావోస్ పెట్టుబడులు ఎటు పోయాయని ప్రశ్నించారు. జపాన్ పర్యటన కూడా అంతే అని పేర్కొన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, కార్యదర్శులు ఎస్ ప్రకాశ్ రెడ్డి, ఉమారాణి, అధికార ప్రతినిధులు విఠల్, రాణి రుద్రమాదేవి, ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావు, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ తదితరులు ఉన్నారు.