సర్కారు భూమి కబ్జా చేసినోళ్లను వదిలిపెట్టొద్దు..అవసరమైతే బుల్డోజర్ల దించండి:బండి సంజయ్

  • అవసరమైతే బుల్డోజర్లు దింపండి: బండి సంజయ్​
  • ప్రభుత్వానికి, ఆఫీసర్లకు మేం అండగా ఉంటాం
  • కేసీఆర్​ కుటుంబం, బీఆర్ఎస్​ లీడర్లు ధరణి పేరుతో ప్రభుత్వ భూములను మాయం చేశారని ఫైర్​

రాజన్న సిరిసిల్ల, వెలుగు: ప్రభుత్వ భూములను ఆక్రమించినోళ్లపై ఉక్కుపాదం మోపాలని, ఈ విష యంలో ప్రభుత్వానికి, అఫీసర్లకు తాము అండగా ఉంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. 

‘‘గత బీఆర్ఎస్ ​పాలనలో కేసీఆర్ కుటుంబం, ఆ పార్టీ నేతలు ధరణి పేరుతో ప్రభుత్వ భూములన్నీ  ప్రైవేట్ చేశారు. సిరిసిల్ల లాంటి జిల్లాల్లో ప్రభుత్వ భవనాలు కడదామంటే జాగా లేకుండా చేశారు. అలాంటివారిని ఉపేక్షించొద్దు. 

అవసరమైతే బుల్డోజర్లు దించాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, సిరిసిల్ల కలెక్టర్​ను మళ్లీ కోరుతున్నా. పేదల జాగలను, ప్రభుత్వ భూములను ఆక్రమించనోళ్లపై ఉక్కుపాదం మోపండి. మీకు మా సహాయ, సహకారాలు ఎప్పు డూ ఉంటయ్” అని వ్యాఖ్యానించారు. 

 సిరిసిల్ల  కలెక్టరేట్​లో శనివారం దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో  సంజయ్ పాల్గొని, మాట్లాడారు. బీఆర్ఎస్​ నేతలు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను విడిపిస్తున్న కలెక్టర్ ​సందీప్ కుమార్ ఝూను ప్రశంసించారు. 

‘‘అధికారుల్లారా.. బీఆర్ఎస్ వాళ్లు కబ్జా చేసిన స్థలాలు, భవనాలన్నీ స్వాధీనపర్చుకోండి. వాళ్లు ఎకరాలకు ఎకరాలు దోచుకుంటా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేం. 

పొట్టోడిని పొడుగోడు కొడితే.. పొడుగోడిని పోచమ్మ కొడతదనే సంగతి గుర్తుంచుకోవాలి” అని సంజయ్​ అన్నారు.  ధరణి పేరుతో కేసీఆర్​ కుటుంబం ప్రభుత్వ భూములను దోచుకున్నదని సంజయ్​ ఆరోపించారు. ఇకపై అలా జరగడానికి వీల్లేదని అన్నారు. 

రాజకీయాలకతీతంగా అభివృద్ధి

రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతున్నదని, భవిష్యత్తులోనూ ఇలాగే ముందుకు పోవాలని సంజయ్​ అన్నారు. సిరిసిల్ల జిల్లాకు త్వ రలో నవోదయ స్కూల్​ మంజూరు కాబోతున్నదని చెప్పారు. అలాగే, వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రసాద్​ స్కీమ్​లో చేరుస్తామని తెలిపారు.

రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద  రూ. 69 లక్షల 54 వేల 911  విలువైన 675 పరికరాలను  322 మంది దివ్యాంగులకు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గడిచిన ఐదేండ్లలో తనను ఏనాడూ కలెక్టరేట్​లో ఏ కార్యక్రమానికీ పిలువలేదని,  పొరపాటున తాను కలెక్టరేట్ కు వెళ్తే ఆఫీసర్లను  బదిలీ చేసే వారని గుర్తు చేశారు.  కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ తదితరులు పాల్గొన్నారు.