న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రైవేట్ సెక్రటరీ (పీఎస్) గా ఐఏఎస్ అధికారి ఆండ్ర వంశీ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్ల పాటు సంజయ్‌కు వంశీ పీఎస్ గా ఉంటారని కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలుకు చెందిన వంశీ 2011 నుంచి ఉత్తర ప్రదేశ్ కేడర్ అధికారిగా సేవలందిస్తున్నారు. ఉద్యోగంలో చేరిన అనతి కాలంలోనే సమర్థవంతమైన ఆఫీసర్ గా ఆయన పేరు తెచ్చుకున్నారు.
యూపీలోని మథుర, ప్రయాగ్ రాజ్, ఝాన్సీ, పిలిభిత్, షాజహాన్ పూర్ తదితర జిల్లాల్లో కలెక్టర్ గా పనిచేశారు. అనంతరం లక్నోలో స్కిల్ డెవలప్ మెంట్ మిషన్ డైరెక్టర్ గా పనిచేశారు. 2006లో హైదరాబాద్ జేఎన్టీయూ నుంచి కంప్యూటర్ సైన్స్ లో ఆయన పట్టా పొందారు. ఆ తర్వాత కొంతకాలం సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేసి సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. 2011లో ఐఏఎస్ అధికారిగా విజయం సాధించారు.