ప్రజాపాలన అంటే.. హామీలు ఎగ్గొట్టుడేనా?

ప్రజాపాలన అంటే.. హామీలు ఎగ్గొట్టుడేనా?
  • రాష్ట్ర సర్కారుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్న
  • అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చినోళ్లపై చర్యలు తీస్కోవాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసుడేనా ప్రజా పాలన అంటే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవుడేనా ప్రజాపాలన అంటూ ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తుంటే.. వాళ్ల దృష్టి మళ్లించేందుకు ఆడుతున్న డ్రామానే హైడ్రా అని విమర్శించారు.

గురువారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వచ్చిన బండి సంజయ్ పార్టీ నేతలతో కలిసి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక నేతలతో కలిసి సికింద్రాబాద్ జనరల్ బజారులోని బట్టలు, బంగారం దుకాణాల వద్ద తిరుగుతూ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు, ఆటో డ్రైవర్లతోసహా పలువురి దగ్గరికి వెళ్లి బీజేపీ సభ్యత్వం తీసుకోవాలన్నారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

పేదల ఇండ్ల జోలికొస్తే ఊకోం

అక్రమ నిర్మాణాలను కూల్చేసుకుంటరా? లేకపోతే తమనే కూల్చమంటరా? అని అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంపై ఆశ్చర్యమేస్తోందని బండి సంజయ్ అన్నారు. హైడ్రాకు తాము వ్యతిరేకం కాదన్నారు. కానీ, పేద, మధ్య తరగతి ఇండ్ల జోలికి వస్తే ఊరుకోబోమని, పేదల పొట్టకొడితే సహించబోమని హెచ్చరించారు.

‘అవి అక్రమ నిర్మాణాలని తెలిసి అధికారులు ఎట్ల పర్మిషన్ ఇచ్చారు? వాటికి రిజిస్ట్రేషన్ ఎట్ల చేశారు? అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారో ముందు సమాధానం చెప్పండి’ అని సంజయ్ డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరమన్నారు.