- ప్రభుత్వం రెగ్యులర్గాపోస్టులు భర్తీ చేస్తలే
- రోజ్ గార్ మేళా ద్వారా దేశంలో మోదీ 9.25 లక్షల జాబ్స్ ఇచ్చారు
- హకీంపేటలో రోజ్ గార్ మేళాకు హాజరు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నదని.. రాష్ట్ర ప్రభుత్వం క్రమంతప్పకుండా ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. హైదరాబాద్లోని అశోక్ నగర్లో చాలా మంది నిరుద్యోగులు ఆర్థిక పరిస్థితి బాగోలేక, ఒక్కపూట భోజనమే తింటూ ఏండ్ల తరబడి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారని తెలిపారు. అలాంటి వాళ్లను తాను చూశానని చెప్పారు. గత బీఆర్ఎస్ పాలకులు పేపర్ లీకుల పేరుతో పరీక్షలను ఏండ్ల తరబడి వాయిదా వేశారని విమర్శించారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2022 అక్టోబర్ 22న రోజ్ గార్ మేళాను ప్రారంభించి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 9 లక్షల 25 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని ఆయన చెప్పారు. హైదరాబాద్ లోని హకీంపేట నేషనల్ ఇండస్ట్రీయల్ అకాడమీలో సోమవారం నిర్వహించిన రోజ్ గార్ మేళా కార్యక్రమానికి బండి సంజయ్ చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని గతంలో మాట ఇచ్చారని, దానికి కట్టుబడి ఇప్పటి వరకు ‘రోజ్ గార్ మేళా’ పేరుతో 9.25 లక్షల మందికి నియామక పత్రాలను అందజేశామని ఆయన చెప్పారు.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీలుంటే.. ఇతర ఉద్యోగులపై భారం పడుతుందని, తద్వారా మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు సేవలందించడం కష్టమవుతుందన్నారు. ‘‘గతంలో మోదీ 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటిస్తే ప్రతిపక్షాలు హేళన చేశాయి. కానీ.. భారత్ ఆర్థిక వ్యవస్థ 4 కోట్ల 66 లక్షల ఉద్యోగాలను సృష్టించిందని గణాంకాలు చెప్తున్నాయి” అని ఆయన పేర్కొన్నారు.
సమస్యలు ఉంటే నాకు చెప్పండి
ఉద్యోగులంతా సంబంధం లేని అంశాలపై సమ్మె చేసి జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టుకోవద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘‘గతంలో పోస్టల్ ఉద్యోగులు సమ్మె చేయడంతో కొత్తగా ఉద్యోగాలు పొందిన 1,200 మంది తెలంగాణ ఉద్యోగులు సస్పెన్షన్ కు గురయ్యారు. సంబంధం లేని అంశంలో సమ్మె చేయడంతో వారు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ విషయాన్ని నేను ప్రధాని మోదీతోపాటు సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి వారిపై సస్పెన్షన్ ఎత్తివేయించిన” అని ఆయన అన్నారు. ఏదైనా సమస్య ఉంటే పైఅధికారులతో పాటు తమ దృష్టికి తీసుకురావాలని బండి సంజయ్ అన్నారు.