కొట్లాడుకునే జమానా పోయింది..కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం:బండి సంజయ్

కొట్లాడుకునే జమానా పోయింది..కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం:బండి సంజయ్
  • కలిసికట్టుగా పనిచేద్దాం.. అభివృద్ధి చేసుకుందాం: బండి సంజయ్ 
  • బిల్లులు రాక మాజీ సర్పంచులు అల్లాడుతున్నరు
  • ఇకనైనా పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

బెజ్జంకి, వెలుగు: ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని, ఎన్నికల తర్వాత అభివృద్ధే లక్ష్యంగా నాయకులు పని చేయాలని కేంద్రమంత్రి బండి సంజయ్​పిలుపునిచ్చారు. ‘‘రాష్ట్రంలో ఎక్కడ సర్వసభ్య సమావేశం పెట్టినా కొట్టుకునే పరిస్థితి వచ్చింది. 

ఇక నుంచి ఆ పరిస్థితి ఉండొద్దు. నాయకులందరూ భేషజాలు విడిచిపెట్టి, కలిసికట్టుగా ప్రజల కోసం పని చేయాలి” అని కోరారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 12,769 మంది మాజీ సర్పంచులకు సంబంధించి దాదాపు రూ.1,300 కోట్ల బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి. 

చాలామంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు. పెండింగ్​బిల్లులు వెంటనే విడుదల చేసి వాళ్ల కుటుంబాలను ఆదుకోవాలి” అని రాష్ట్ర సర్కార్ కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో రూ.3 కోట్ల నాబార్డ్ నిధులతో నిర్మించిన ఫంక్షన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్ ను సంజయ్ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద తెలంగాణలో 30 లక్షల మంది రైతులకు ఏటా రూ.6 వేల చొప్పున చెల్లిస్తున్నామని చెప్పారు. ‘‘రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చూస్తున్నాం. ఎరువుల మీద ఇప్పటి వరకు దాదాపు రూ.30 వేల కోట్ల సబ్సిడీ ఇచ్చాం. 

రాష్ట్రాభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అన్ని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు అభివృద్ధే లక్ష్యంగా కలిసికట్టుగా పని చేస్తున్నారు” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, కరీంనగర్ డీసీఎం చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ తన్నీరు శరత్ రావు తదితరులు పాల్గొన్నారు.