కులగణన సర్వే ఫేక్​ :బండి సంజయ్

కులగణన సర్వే ఫేక్​ :బండి సంజయ్

 

  • సర్వే పేరిట కాంగ్రెస్ టైంపాస్ రాజకీయం    
  • రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన దుర్మార్గమైంది.. చిత్తశుద్ధితో చేస్తలే
  • స్థానిక సంస్థల ఎన్నికలను లేట్​ చేసేందుకే డ్రామాలు
  • గత సర్కార్​ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్​ ఏమైందని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: కులగణన సర్వే పేరుతో కాంగ్రెస్ టైంపాస్ రాజకీయాలు చేస్తున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్​ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలను జాప్యం చేసేందుకే సర్వే పేరిట డ్రామాలు ఆడుతున్నదని దుయ్యబట్టారు. ‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పేరుతో కులం సహా అన్ని వివరాలు సేకరించింది. ఆ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదు? కేసీఆర్ నిర్వహించిన  సమగ్ర కుటుంబ సర్వే ఉండగా.. మళ్లీ కులగణన పేరుతో  డ్రామాలెందుకు? కులగణన సర్వేకు రూ.150 కోట్ల నిధులు కేటాయించడం, కులగణన నిర్వహించడం ఫేక్” అని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం హైదరాబాద్​ నాంపల్లిలో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరైన అనంతరం బండి సంజయ్​ మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారంటీలు, రుణమాఫీ అమలు విషయంలో ప్రజలు కాంగ్రెస్​పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఇప్పటికిప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్​ పార్టీ ఘోరంగా ఓడిపోతుందన్న భయంతోనే కులగణన పేరుతో ఆ పార్టీ టైం పాస్ రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. 

‘‘కులగణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన దుర్మార్గమైంది. చిత్తశుద్ధితో చేయడం లేదు” అని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో కులగణన సహా అన్ని వివరాలను పొందుపర్చారని, ఆనాడు వేరే దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రజలను కూడా రప్పించి నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఏమైందని  ప్రశ్నించారు. ‘‘అసలు ఆనాటి సర్వేలో ఏముంది? బీఆర్ఎస్ ఆ నివేదికను బయటపెట్టలేదు. కాంగ్రెస్ సర్కార్​ కూడా ఎందుకు బయటపెట్టడం లేదు? ఆ రెండు పార్టీల  మధ్యనున్న చీకటి ఒప్పందంలో భాగంగానే నివేదికను బయటపెట్టడం లేదా? అసలు ఆ నివేదికలో ఉన్న లోపాలేమిటి? ” అని సంజయ్​ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికను బయటపెట్టాలన్నారు.