హైదరాబాద్: ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు డ్రామాలాడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. అమృత్‌లో జరిగిన అవినీతి బయటకు రావాలంటే సీవీసీ విచారణను కోరాలని డిమాండ్ చేశారు. దేశంలోని పట్టణాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చే ఒక సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకాన్ని ప్రవేశపెడితే గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతూ ఈ పథకం ప్రయోజనాలు ప్రజలకు అందకుండా చేస్తున్నాయని ఫైర్అయ్యారు.
ALSO READ | గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో BRS ఎమ్మెల్యేలు
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకంలో పెద్దఎత్తున అవినీతికి పాల్పడి తమకు కావాల్సిన వాళ్లకే కాంట్రాక్టులు కట్టబెట్టిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ ప్రత్యారోపణలు చేయడం దొందుదొందే అన్న విధంగా ఉందన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలులో వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించేందుకు వీరిరువురూ సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటూ డ్రామా చేస్తున్నారని దుయ్యబట్టారు.
అమృత్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని, కాంట్రాక్టు కట్టబెట్టడంలో పక్షపాతం చూపలేదని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తే తక్షణమే సీవీసీకి లేఖ రాయాలన్నారు. లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడినట్టు భావించాల్సి వస్తుందని అన్నారు. సీవీసీ లేఖ రాస్తే దీనిపై విచారణ జరిపేందుకు సీవీసీని ఒప్పించేలా నేనే వ్యక్తిగతంగా చొరవ చూపుతానని తెలిపారు.