బీదర్లో కేసీఆర్‎కు దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్: బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్

బీదర్లో కేసీఆర్‎కు దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్: బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్

కరీంనగర్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‎పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బీదర్‎లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్‏ను నడిపించాడని.. ఆ దొంగ నోట్లు పంచే బీఆర్ఎస్ ఎన్నికల్లో గెల్చిందని ఆరోపించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు ఆదివారం కరీంనగర్లో సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చీఫ్ గెస్ట్‎గా హాజరై ప్రసంగించారు. 

డీలిమిటేషన్‎కు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలు శనివారం చెన్నైలో భేటీ కావడంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. దేశానికి ఎక్కువ ఆదాయం దక్షిణాది రాష్ట్రాల నుంచే వెళ్తుందని.. అలాంటి రాష్ట్రాలకు డీలిమిటేషన్లో కేంద్రం ఎలా అన్యాయం చేస్తోందని దక్షిణాది రాష్ట్రాలు మాట్లాడుతున్నాయి.. అసలు దేశ జీడీపీకి, డీలిమిటేషన్‎కు ఏం సంబంధమని ప్రశ్నించారు. తెలంగాణ జీడీపీలో ఆదిలాబాద్, ములుగు, ఆసిఫాబాద్ వెనకబడి ఉన్నాయి.. అలా అని ఆ రాష్ట్రాలకు వాటా అక్కర్లేదా..? అని నిలదీశారు. 

డీలిమిటేషన్ పేరుతో లిక్కర్ దొంగలంతా ఒకే చోట చేరి దక్షిణాది పేరుతో డ్రామాలాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 6 గ్యారంటీలపై ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంకా 16 లక్షల మంది రైతులకు రుణమాఫీ కానేలేదు.. ఇప్పటికే రుణమాఫీ పూర్తయ్యిందని మంత్రి ప్రకటించడం సిగ్గు చేటని విమర్శించారు. టీచర్లారా.. మీ భవిష్యత్ కోసం తపస్‎లో చేరండని.. తపస్ పక్షాన ఉద్యమాలను ఉద్ధృతం చేయండని పిలుపునిచ్చారు. మీ ఉద్యోగాలు పోతే.. బీజేపీ టిక్కెట్లిచ్చి గెలిపించుకుంటామని భరోసా ఇచ్చారు.