- తెలంగాణ పైసలన్నీ మహారాష్ట్రలో ఖర్చు చేస్తున్నరు
- కులగణన పేరుతో ప్రజల ఆస్తులవివరాలు తీసుకుంటున్నరు
- హామీలన్నీ అమలు చేసినట్టు కోట్లు ఖర్చు చేసి యాడ్స్ ఇస్తున్నరు
- మహారాష్ట్రలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలే
- నాగ్ పూర్లో కేంద్ర మంత్రి ఆరోపణ
హైదరాబాద్, వెలుగు : తెలంగాణలో ‘కమీషన్ల’ పాలన నడుస్తున్నదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ప్రతి పనిలో, కాంట్రాక్టుల్లో15 శాతం కమీషన్ తీసుకుంటూ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని ఫైరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కదాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 420 హామీల్లో దేన్నీ అమలు చేయని కాంగ్రెస్ సర్కార్ను.. ఫోర్ ట్వంటీ సర్కార్ అనాలని ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ బుధవారం నాగ్పూర్ లో మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో అమలుకాని హామీలను అమలు చేస్తున్నట్టుగా మహారాష్ట్రలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి యాడ్స్ ఇస్తున్నారని విమర్శించారు. 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఇవ్వలేదని స్వయంగా వ్యవసాయశాఖ మంత్రే ప్రకటించారని, కానీ తెలంగాణలో రుణమాఫీ అమలు చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ సొమ్మును ఖర్చు చేస్తూ రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారన్నారు. సీఎం రేవంత్మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చెప్పినవన్నీ అబద్ధాలేనన్నారు.
‘‘కాంగ్రెస్ పార్టీ తొలుత హిమాచల్ ప్రదేశ్‌లో 10 గ్యారంటీల హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, ఆ తర్వాత కర్నాటకలో పాంచ్ న్యాయ్ పేరుతో, తెలంగాణలో ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిందని చెప్పారు. కానీ వాటిని అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. హర్యానాలోనూ ఇలాంటి హామీలతో అధికారంలోకి రావాలని చూశారని, కానీ అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారన్నారు. కుల జనగణన పేరుతో ప్రజల ఆస్తుల వివరాలు సేకరించాలని చూస్తున్నారని, ప్రజలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని బండి సంజయ్ చెప్పారు.
ఏడాది నిండకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. మూసీ పునరుజ్జీవం పేరుతో లక్షన్నర కోట్లను దోచుకునేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. రాష్ట్రంలో పది నెలల్లో 100కుపైగా దేవాలయాలపై దాడులు జరిగాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇదే ఫార్ములాను మహారాష్ట్రలో అమలు చేయాలని ప్రయత్నిస్తున్నదన్నారు. మీడియా సమావేశంలో కర్నాటక బీజేపీ నేత నారాయణస్వామి, హిమాచల్ ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ బిందాల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ తదితరులు పాల్గొన్నారు.