
మంచిర్యాల: కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఆదివారం (ఫిబ్రవరి 23) మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో బండి సంజయ్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా జలాలను పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుంటే తెలంగాణ రైతాంగాన్ని వరి వేయొద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనడం సిగ్గుచేటని విమర్శించారు. గతంలో కేసీఆర్ వరి వేస్తే ఉరి అంటే.. ఇప్పుడు వరి వెయ్యొద్దని అనడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆటకెక్కించిందని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్‌లు ప్రజా సంపదను లూటీ చేస్తే ఇప్పటి వరకు కూడా అరెస్టులు చేయకుండా కాలయాపన చేయడం కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఓ ఏటీఎం లాగా మారిందని అన్నారు.
కేసీఆర్ అహంకారంతో వ్యవహరించడం వల్లనే ప్రజలు బుద్ధి చెప్పి ఫాం హౌస్‌లో కూర్చోబెట్టారన్నారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేస్తారని బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేసింది బీఆర్ఎస్ పార్టీయేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో కేసీఆర్ ఓ నియంత లాగా వ్యవహరించి ప్రశ్నించే నాయకులను అడ్డుకుని తప్పుడు కేసులతో జైల్లో పెట్టించాడని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరాలంటే పార్టీ శ్రేణులు కసితో పని చేయాలని పిలుపునిచ్చారు బండి సంజయ్.