హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలకులు చేసిన అప్పులు, తప్పిదాల వల్ల రాష్ట్రం ఎలా దివాలా తీసిందో అసెంబ్లీ సాక్షిగా బయటపడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రూ.6.71 లక్షల కోట్ల అప్పు చేసినట్టు ప్రభుత్వమే ప్రకటించిందని, అయితే, కాంగ్రెస్ ఏడాది పాలనలో రూ.1.27 లక్షల కోట్లు అప్పులు చేసినట్టు వెల్లడైందని చెప్పారు.
ఈ రెండు పార్టీలకు అధికారం కట్టబెట్టిన పాపానికి రూ.8 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారని, ప్రజల చేతికి చిప్ప అందించారని గురువారం ఒక ప్రకటనలో ఆయన మండిపడ్డారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను తమ స్వార్థ ప్రయోజనాల కోసం దివాలాకోరు విధానాలతో వడ్డీలు కట్టడానికి కొత్తగా అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడడం బాధాకరమన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైందని ఆయన ఆరోపించారు. చేసిన తప్పులను అంగీకరించి, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి అప్పులు చేయడం కరెక్టేనని సమర్థించుకోవడం దారుణమన్నారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరును ఎండగట్టాలని కోరుతున్నామని, ఆరు గ్యారంటీలను అమలు కోసం సంక్రాంతి తర్వాత ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.