
కొడిమ్యాల, వెలుగు: కొడిమ్యాల మండల ప్రజల చిరకాల కోరిక తీరిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మంగళవారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి మండల కేంద్రంలో రూ.65 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును, వివిధ గ్రామాల్లో రూ.2.59కోట్లతో చేపట్టనున్న రోడ్డు పనులను, రూ.23.50 లక్షల ఎంపీ నిధుల ద్వారా చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా చొప్పదండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని నిధులు నియోజకవర్గానికి కేటాయిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలని, మిగిలిన 5ఏండ్ల అభివృద్ధిపై దృష్టి పెడతామన్నారు. అంతకుముందు పూడూరు నుంచి కొడిమ్యాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ ప్రాంతంలో అంబేద్కర్, శివాజీ విగ్రహాలకు పూలమాలలు సమర్పించి కార్యక్రమానికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, లీడర్లు కొత్తూరి మహేశ్, ఏలేటి మమత, ముత్యం శంకర్, గౌతమ్ రెడ్డి, రవీందర్‌రెడ్డి, పిడుగు ప్రభాకర్ రెడ్డి, రాజేందర్ పాల్గొన్నారు.