చైనా ఆదేశాలతోనే బంగ్లాదేశ్ ఘటనపై రాహుల్ నోరు విప్పట్లే : బండి సంజయ్

చైనా ఆదేశాలతోనే బంగ్లాదేశ్ ఘటనపై  రాహుల్ నోరు విప్పట్లే : బండి సంజయ్

కరీంనగర్, వెలుగు: చైనా ఆదేశాలతోనే బంగ్లాదేశ్ ఘటనపై రాహుల్ గాంధీ నోరు విప్పడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. నెహ్రూ కుటుంబ రాజకీయ లబ్ధి కోసమే మహనీయుల త్యాగాలను కనుమరుగు చేసే కుట్ర చేస్తున్నారని, అంబేద్కర్ ఆలోచనలను తెరమరుగు చేస్తున్నారని మండిపడ్డారు. మహనీయుల త్యాగాలను స్మరించుకునేందుకు ‘హర్ ఘర్ తిరంగా’ పేరిట కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. 

భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ నుంచి టవర్ సర్కిల్ వరకు ఆదివారం ‘హర్ ఘర్ తిరంగా’ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పిలుపు మేరకు బీజేవైఎం ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ యాత్రను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగరేయడం, సెమినార్లు నిర్వహించడం, దేశం కోసం త్యాగం చేసిన మహనీయుల విగ్రహాలను శుద్ధి చేసి పుష్పార్చన చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

దేశభక్తుల ఫొటోలను పంద్రాగస్టు వరకు వాట్సప్ డీపీలుగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కాలని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నదని విమర్శించారు. కుల, మత, ప్రాంతాల పేరుతో ప్రజలను చీల్చే కుట్రలు చేస్తున్నారన్నారు.  కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణా రెడ్డి, బీజేపీ నాయకులు ప్రవీణ్ రావు, వికాస్ రావు, కటకం లోకేష్ తదితరులు పాల్గొన్నారు.