బోనస్ తప్పించుకోవడానికే వడ్ల కొనుగోళ్లు లేట్ : బండి సంజయ్

 

శంకరపట్నం/భీమదేవరపల్లి/ఎల్కతుర్తి, వెలుగు: బోనస్ ఎక్కడ ఇవ్వాల్సి వస్తదో అని రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. 95 లక్షల టన్నుల వడ్లు సేకరిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం.. 95 వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. 20 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతులు వ్యాపారులకు అమ్మేశారని తెలిపారు. మిల్లర్లు, దళారులకు వడ్లు విక్రయించుకుంటున్నారని అన్నారు. వాళ్లేమో 5 కిలోల నుంచి 10 కిలోల వరకు తరుగు తీస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. 

ఈ సందర్భంగా రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో పర్యటించారు. బయట అమ్ముకున్నా.. బోనస్ ఇవ్వాల్సిందే బయట అమ్ముకున్న ధాన్యానికి కూడా బోనస్ ఇవ్వాలని, లేకపోతే రైతులే ప్రభుత్వ మెడలు వంచుతారని బండి సంజయ్ హెచ్చరించారు. ‘‘95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అందులో 45 లక్షల టన్నులు బహిరంగ మార్కెట్​లో అమ్ముకున్నా.. 50 లక్షల టన్నులు ఎఫ్​సీఐకి ఇవ్వాల్సి ఉంటది. ఆ 50 లక్షల టన్నులకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తే.. రూ.2,500 కోట్లకుపైగా ఖర్చవుతది. కానీ.. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేక కొనుగోళ్లు చేపట్టడంలేదు. 40 రోజుల్లో 20 లక్షల టన్నులు కొనాల్సి ఉంటే.. 95వేల మెట్రిక్ టన్నులే కొన్నరు. డిసెంబర్​లో 30 లక్షల టన్నులు కొనాలి. అంత ధాన్యాన్ని ఇంకెప్పుడు కొంటరు?’’అని బండి సంజయ్ నిలదీశారు. 

ఆరు గ్యారంటీలు ఏమైనయ్?

‘‘ఇందిరమ్మ పాలన అంటే రైతులను అరిగోస పెట్టడమేనా? ఇంకా 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. ఏడాది పాలనలో ఏం సాధించారని ప్రజా విజయోత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నరు? ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మోసం చేశారు. మహిళలకు ఇస్తామన్న రూ.2,000 ఎటుపోయినయ్? పెండ్లి చేసుకుంటే తులం బంగారం ఏమైంది? వృద్ధులకు రూ.4వేల పెన్షన్ ఎప్పుడిస్తరు? 2 లక్షల ఉద్యోగాలు.. స్టూడెంట్లకు భరోసా కార్డుల హామీలు ఏమైనయ్?’’అని సంజయ్ ప్రశ్నించారు. 

ప్రజా విజయోత్సవాలు కాకుండా.. ప్రజా వంచన ఉత్సవాలు జరుపుకోవాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనకు బీజేపీ వ్యతిరేకం కాదన్నారు. గతంలో కేసీఆర్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టు ఏమైందని ప్రశ్నించారు. ఆ రిపోర్టు ఉండగా.. మళ్లీ కుల గణన అవసరం లేదన్నారు. ఆ రిపోర్టు ప్రభుత్వానికి కేసీఆర్ ఇవ్వకపోతే.. దాని కోసం ఖర్చు చేసిన డబ్బులన్నీ ముక్కు పిండి వసూలు చేయాలని సూచించారు. లేదంటే కేసీఆర్ ఆస్తులు జప్తు చేయాలని డిమాండ్ చేశారు.