మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు : బండి సంజయ్​

మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు : బండి సంజయ్​
  • పేదల ఇండ్లను కూల్చడాన్నే వ్యతిరేకిస్తున్నం
  • అప్పు చేసి మూసీ పునరుద్ధరణ చేయడం దుర్మార్గం
  • ఈ ప్రాజెక్టును కాంగ్రెస్​ ఏటీఎంలా వాడుకోవాలనుకుంటోందని కామెంట్
  • సర్కారు తీరును నిరసిస్తూ నేడు ఇందిరా పార్కు వద్ద బీజేపీ మహాధర్నా  

హైదరాబాద్, వెలుగు: మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేని సమయంలో మళ్లీ లక్షన్నర కోట్లు అప్పు చేసి, మూసీ పునరుజ్జీవం పేరుతో ప్రజలపై మోయలేని భారం వేయడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. ఈ విషయంలో సర్కారు తీరును నిరసిస్తూ మూసీ బాధితుల పక్షాన శుక్రవారం ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్ద మహాధర్నా చేపడుతున్నామని, ఇందులో బాధితులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు.

మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల కూల్చివేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి తెరదీస్తోందని ఆరోపించారు. రూ.1.50 లక్షల కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ఏటీఎంలాగా ఉపయోగించుకోవాలనుకుంటోందని పేర్కొన్నారు. ఉద్యోగులకు జీతాలివ్వడమే గగనమైందని, గత పాలకులు చేసిన దాదాపు రూ.6 లక్షల కోట్ల పైచిలుకు అప్పులకు 10 నెలల్లోనే రూ.60 వేల కోట్లు వడ్డీ రూపంలో చెల్లిస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తోందన్నారు.

ఇప్పటికే మూసీ ప్రక్షాళన పేరుతో గత మూడు దశాబ్దాలుగా జైకా, జపాన్ సహా ఇతరత్రా మార్గాల ద్వారా పెద్ద ఎత్తున నిధులు కూడా ఖర్చు చేశారని గుర్తుచేశారు. గత పాలకులు లక్ష కోట్ల రూపాయలకుపైగా అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు మూసీ పునరుజ్జీవం పేరుతో మరో లక్షన్నర కోట్లు అప్పు చేసి ఏటీఎం మాదిరిగా వాడుకోవాలని చూస్తుండడం బాధాకరమని వెల్లడించారు. నాబార్డ్ సంస్థ ఇచ్చిన ‘ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే’ నివేదిక ప్రకారం దేశంలోనే అత్యధికంగా అప్పుల్లో ఉన్నది తెలంగాణ వాసులేనని తెలిపారు.