నేనడుగుతున్నా.. బొట్టు పెట్టుకుని టోపీ లేకుండా నమాజ్ చేయనిస్తారా..?

హైదరాబాద్: దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న తిరుమల లడ్డూ కల్తీ ఇష్యూపై బీజేపీ కీలక నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ (సెప్టెంబర్ 28) హైదరాబాద్ బండ్ల గూడ జాగీర్‎లోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరుమల డిక్లరేషన్‎పై రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యమతస్తులు హిందూ ఆలయాల్లోకి ప్రవేశిస్తే డిక్లరేషన్ ఇచ్చిన ఉదంతాలెన్నో ఉన్నాయ్.. తిరుమల వెళ్లేందుకు జగన్ కూడా డిక్లరేషన్ ఇస్తే తప్పేముందని ప్రశ్నించారు. 

డిక్లరేషన్‎పై జగన్ మాట్లాడిన తీరు హిందుత్వంపై దాడి చేసినట్లుగా ఉందని మండిపడ్డారు. దళితులను తిరుమలలో అన్యాయం జరుగుతోందని చెప్పడం సిగ్గు చేటని.. దళితులే అసలైన హిందూ ధర్మ రక్షకులని  బండి సంజయ్ అన్నారు. దళితులపై లేనిపోని ప్రేమ ఒలకబోస్తూ క్రిస్టియన్లుగా మార్చే కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. జగన్ పాలనలో ఎంత మంది దళితులకు తిరుమలలో అన్యాయం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 

ALSO READ | తిరుమల లడ్డూ వివాదం: సెప్టెంబర్ 30న సుబ్రహ్మణ్య స్వామి పిటీషన్ పై విచారణ..

తిరుమల డిక్లరేషన్‎పైన బండి హాట్ కామెంట్స్ చేశారు. ‘‘నేనడుగుతున్నా అన్యమతస్తులు తిరుమల వస్తే డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధనలు ఎప్పటి నుండో ఉందని.. ఇది కొత్తగా పెట్టిన నిబంధన కాదని గుర్తు చేశారు. అలాంటప్పుడు క్రిస్టయన్ అయిన జగన్  తిరుమలకు వెళుతున్నప్పడు డిక్లరేషన్ ఇస్తే వచ్చే ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. గతంలో పూరి ఆలయానికి వెళితే ఇందిరాగాంధీ పార్శి మతస్తుడిని పెళ్లి చేసుకుందని రానివవ్వలేదు. నేపాల్ పశుపతినాథ్ ఆలయానికి వెళ్ళిన సోనియాగాంధీ క్రిస్టియన్ కాబట్టి రానివ్వలేదని అంత మాత్రాన దాడి జరిగినట్లా అని నిలదీశారు.

 ‘‘నేనడుగుతున్నా.. బొట్టు పెట్టుకుని టోపీ లేకుండా నమాజ్ చేయబోమని మక్కా మసీదుకు హిందువులు వెళితే అనుమతిస్తారా..? ప్రార్ధనలు చేయకుండా వాటికన్ సిటీ, జెరూసలెంకు హిందువులు వెళతానంటే ఒప్పుకుంటారా..? మరీ తిరుమల విషయంలోనే ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారు’’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తీరును చూస్తుంటే టీటీడీ లడ్డూ ప్రసాదంలోనూ కల్తీ చేసినట్లు అనిపిస్తోందని.. ఇది ముమ్మాటికీ హిందుత్వంపై జరుగుతున్న దాడిలో భాగమేనని.. దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క హిందువుపై ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు.