- లోక్ మంథన్ సన్నాహక సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్
- సమాజంలో చీలికలు తెచ్చేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని ఫైర్
- కాలానికి అనుగుణంగా హిందూ సమాజంలో మార్పులు తప్పవని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: భారతీయ సంస్కృతి గలగలా పారే జీవనది లాంటిదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కొందరు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై దాడి చేస్తూ సమాజంలో చీలికలు తెచ్చేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈ తరుణంలో సమాజాన్ని ఏకం చేస్తూ భారతీయ విలువలు పెంపొందిస్తూ ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో లోక్ మంథన్ పేరుతో చేస్తున్న కార్యక్రమాలు ఎంతో ఆదర్శనీయమని ఆయన కొనియాడారు. హైదరాబాద్ జలవిహార్ లో శనివారం సాయంత్రం జరిగిన లోక్ మంథన్ సన్నాహక సమావేశానికి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లోక్ మంథన్ భాగ్యనగర్-–2024 బ్రోచర్ ను ఆయన ఆవిష్కరించారు.
అనంతరం సంజయ్మాట్లాడుతూ.. నవంబర్ 21 నుంచి 24 వరకు హైటెక్ సిటీ శిల్పకళావేదికలో లోక్ మంథన్ ఇంటర్నేషనల్ సమావేశం జరగనున్నదని చెప్పారు. ప్రపంచంలో జరుగుతున్న అనేక మార్పులపైన చర్చించడంతో పాటు హిందూ సమాజ ప్రగతి, భారతీయ సనాతన విలువలను పెంపొందించేందుకు లోక్ మంథన్ వేదిక కావడం సంతోషకరమని చెప్పారు. తరాలు, యుగ ధర్మాలు మారుతున్నాయని.. దానికి అనుగుణంగానే భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో, హిందూ సమాజంలో మార్పులు రావడం సహజమని తెలిపారు. ఎంత మంచి నీళ్లైనా సరే.. ఒకే చోట కదలకుండా నిశ్చలంగా ఉంటే ఆ నీరు ఖరాబవుతుందన్నారు.
మారుతున్న కాలానికి, ధర్మానికి అనుగుణంగా హిందూ సమాజ విలువల్లో కూడా మార్పు అనివార్యమని చెప్పారు. భారతదేశం సనాతన ధర్మానికి కేంద్రమని, ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని ఆచరించే వారికి మన దేశమే ఆధారమని గుర్తుచేశారు. బుర్రకథ, జానపదాలు, జాతర వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు లోక్ మంథన్ నిర్ణయించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ప్రజ్ఞాభారతి చైర్మన్, పద్మశ్రీ టి.హనుమాన్ చౌదరి, సామవేదం షణ్ముఖశర్మ, నందకుమార్ తదితరులు పాల్గొన్నారు.