నర్వ మండల రూపురేఖలు మార్చండి : బండి సంజయ్​కుమార్​

నర్వ మండల రూపురేఖలు మార్చండి : బండి సంజయ్​కుమార్​

నర్వ, వెలుగు: సమగ్రత అభియాన్​లో భాగంగా ఎంపికైన నర్వ మండలం రూపురేఖలు మార్చాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్​కుమార్​ కలెక్టర్​ను ఆదేశించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి అన్ని విధాలా అభివృద్ధి చేయాలని కేంద్రం అందుకు పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. గురువారం ఆయన ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి రాయికోడ్​ గ్రామంలో పర్యటించారు. మొదటగా గ్రామంలోని అంగన్ వాడీ సెంటర్ ను సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. పిల్లలకు అందిస్తున్న పోషకాహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణులకు సీమంతం సందర్భంగా పండ్లను అందజేశారు. 

అక్కడి నుండి పీహెచ్​సీకి వెళ్లిన బండి సంజయ్ అక్కడ డాక్టర్ లేరని ప్రజలు చెప్పడంతో తక్షణమే రెగ్యులర్ డాక్టర్ ను నియమించాలని అధికారులను ఆదేశించారు. నర్వ మండల కేంద్రంలో ప్రజల సమస్యలన్నీ పరిష్కరించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో మళ్లీ నర్వకు వస్తానని, ఆలోపు రోడ్డు నిర్మాణంతోపాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే శ్రీహరి మక్తల్​కు నవోదయ స్కూల్​ను శాంక్షన్​ చేయించాలని ఎంపీని కోరారు. 

ఎస్ఎస్ఏ ఉద్యోగులకు మద్దతు తెలిపిన ఎంపీ  

నారాయణపేట: ఎస్ఎస్ఏ​ఉద్యోగులకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్​కుమార్​ అన్నారు. గురువారం జిల్లా  కలెక్టరేట్​లో జరిగిన సమావేశానికి ఎంపీ డీకే అరుణతో కలిసి వచ్చిన మున్సిపల్​ పార్క్​ దగ్గర సమ్మె చేస్తున్న ఎస్ఎస్ఏ​ఉద్యోగులతో మాట్లాడారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్​చార్జి రతంగ్ పాండ్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు  శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రఘురామయ్యా, సత్య యాదవ్, రఘువీర్ యాదవ్, సమగ్ర శిక్ష ఉద్యోగుల జాక్ చైర్మన్ ఎల్లగౌడ్, అల్తాఫ్, విజయ, గౌరమ్మ, రాజేశ్వరి, రాములు, హర్షద్, రవి, కృష్ణ కుమార్ పాల్గొన్నారు.