ఫామ్​హౌస్​లో పడుకునే కేసీఆర్​కు ప్రతిపక్ష నేత పదవెందుకు : బండి సంజయ్​

ఫామ్​హౌస్​లో పడుకునే కేసీఆర్​కు ప్రతిపక్ష నేత పదవెందుకు : బండి సంజయ్​
  • ప్రజా సమస్యలపై స్పందించని ఆయన అపొజిషన్ లీడరా?
  • అలాంటప్పుడు జీతం ఎందుకు తీసుకోవాలి? 
  • ఇందుకేనా కేసీఆర్​కు ప్రజలు ఓట్లేసింది?
  • మన్మోహన్​కు సంతాపం తెలుపని మూర్ఖుడు కేసీఆర్​
  • ఇక రాష్ట్రంలో ఆ రాచరిక కుటుంబ పాలన రాదు
  • కాంగ్రెస్​ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్​ చేస్తున్నదని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ఫామ్ హౌస్​లో పడుకునే కేసీఆర్​ కు ప్రతిపక్ష నేత పదవి ఎందుకని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు.  ‘‘ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించకపోతే, మాట్లాడకపోతే నువ్వేం ప్రతిపక్ష నేతవి?” అని కేసీఆర్​ను నిలదీశారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీస్​లో బండి సంజయ్​ మీడియాతో మాట్లాడారు. “ప్రజలు ఓడిస్తే ఫామ్ హౌస్​కే పరిమితమవుతా అన్నారు. చెప్పినట్టే ఆయన ఫామ్​హౌస్​కే పరిమితమయ్యారు. అలా అనేందుకు సిగ్గుండాలి. అది నోరా.. మోరా” అని మండిపడ్డారు. ఫామ్ హౌస్​లో పడుకోవడానికా కేసీఆర్​కు ప్రజలు ఓట్లేసింది? అని ప్రశ్నించారు.  ‘‘అలాంటప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు తీసుకోవాలి? జీతం ఎందుకు తీసుకోవాలి?” అని కేసీఆర్​ను నిలదీశారు.  

కేసీఆర్​ ఏవిధంగా ప్రజాప్రతినిధి అవుతారంటూ ఎద్దేవా చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ లో మంత్రిగా కేసీఆర్ పనిచేశారని, కనీసం ఆయన చనిపోతే  కూడా సంతాపం తెలుపని మూర్ఖుడు కేసీఆర్​ అని మండిపడ్డారు. కేసీఆర్ విశ్వాసఘాతకుడు అని ఫైర్​ అయ్యారు. అంబేద్కర్, జ్యోతి బాపూలే జయంతి, వర్ధంతులకు కూడా  కేసీఆర్​రారని అన్నారు. కానీ ఎన్నికలుంటే మాత్రం పీవీ  నర్సింహారావు జయంతి, వర్ధంతికి వస్తారని ఎద్దేవా చేశారు. 

ప్రతిపక్ష నేత హోదా కేసీఆర్​ కుటుంబానికే ఇవ్వాలనుకుంటే హరీశ్​రావుకు ఇవ్వాలని లేదా బీసీలకు ఇవ్వాలనుకుంటే గంగుల కమలాకర్ కో, తలసాని కో ఇవ్వాలని సూచించారు. ‘‘పదవులన్నీ నీకే కావాలి.. కానీ ఫామ్ హౌస్​ లో పంటావా?’’ అని విమర్శించారు. ఒకప్పుడు ఆయన భాష, యాసతో.. పిట్టకథలతో నడిచిందని, కానీ ఇకముందు అది నడ్వదని, ఆయన కుటుంబ పాలన ఇక రాదని అన్నారు. 

బీఆర్ఎస్​ను కాంగ్రెస్ మించిపోయింది

ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడంలో బీఆర్ఎస్​ను  కాంగ్రెస్ సర్కారు మించిపోయిందని బండి సంజయ్ అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా 6 గ్యారంటీలను అమలు చేయకుండా..  కాళేశ్వరం కమిషన్, విద్యుత్ కమిషన్, ఫోన్ ట్యాపింగ్ కేసు, డ్రగ్స్ కేసు అంటూ ప్రతినెలా ఏదో అంశంపై ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు తలమీదకు వస్తుండడంతో  కొత్తగా రైతు భరోసా పేరుతో మరో కొత్త డ్రామాకు తెరలేపారని అన్నారు. రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ.12 వేల చొప్పున మూడు దఫాలుగా రూ.18 వేల రూపాయలు బకాయిపడ్డారని తెలిపారు. 

Also Read :- స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్

ఈ లెక్కన 70 లక్షల మంది రైతులకు రూ.19 వేల 600 కోట్లు బకాయి ఉన్నారని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఒక్కొక్కరికీ రూ.48 వేలు, మహిళలకు రూ.30 వేల చొప్పున దాదాపు రూ.50 వేల కోట్లు రేవంత్ ప్రభుత్వం బకాయి పడిందని అన్నారు. ఈ సొమ్మంతా జనవరి 26 నాటికి చెల్లిస్తారా? లేదా? అనేది  ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ హామీల అమలుకు కావాల్సిన రూ.లక్ష కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని అడిగారు. ప్రభుత్వం ఇప్పటికే రూ.70 వేల కోట్లదాకా అప్పు తెచ్చిందని, గత 3 నెలలుగా ప్రతి నెలా రూ.10 వేల కోట్ల అప్పు తెస్తున్నదని వివరించారు. ఇంకా రూ.30వేల కోట్లు కావాలని ఆర్ బీఐకి ప్రతిపాదనలు పంపించారని తెలిపారు. ఇలా అప్పులు చేస్తే కేసీఆర్ కు, మీకు తేడా ఏముందని ప్రశ్నించారు. 

కేంద్రం నుంచి భారీగా నిధులు కేటాయిస్తున్నం

తెలంగాణకు కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తున్నట్టు సంజయ్ చెప్పారు. పదేండ్లలో రైల్వేలో రూ.32 వేల కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. ఈ ఏడాది రైల్వే బడ్జెట్ లో రూ.5,336 కోట్లు తెలంగాణకు కేటాయించినట్టు పేర్కొన్నారు. రూ.18 వేల కోట్లతో ట్రిపుల్ ఆర్ ను నిర్మిస్తున్నామని చెప్పారు. గ్రామాలకు కేంద్రం ఏ పథకానికి ఎన్నెన్ని నిధులు ఇచ్చింది  శ్వేతపత్రం రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాము ఏమేమి ఇచ్చామో వెల్లడిస్తామని, ఇదే అంశంపై  స్థానిక ఎన్నికలకు పోదామా? అని కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. తెలంగాణసహా ఏ రాష్ట్రమైనా, ఏ పార్టీ అయినా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఆ పార్టీలను ప్రజలు ఓడిస్తారని స్పష్టం చేశారు.