హైడ్రాతో కాంగ్రెస్ తలగోక్కుంటోంది:బండి సంజయ్

హైడ్రాతో కాంగ్రెస్ తలగోక్కుంటోంది:బండి సంజయ్
  • రేవంత్​కు దమ్ముంటే ఒవైసీ నిర్మాణాలను పడగొట్టాలి:బండి సంజయ్
  • హైడ్రా దుశ్చర్యలతో సంక్షోభంలో రియల్ ఎస్టేట్ 
  • పేదల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు:హైడ్రా పేరుతో కాంగ్రెస్ పార్టీ తల గోక్కొంటోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో మూసీ నది చుట్టు పక్కల ఉన్న పేద హిందువుల ఇండ్లను కూల్చివేసేందుకు సిద్ధమైందని తెలిపారు. పేద ప్రజల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని  స్పష్టం చేశారు. శనివారం  బండ్లగూడ జాగీర్ లోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు.  

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ పనైపోయిందని,  మూసీ, హైడ్రాతోపాటు 6 గ్యారంటీలు, మాజీ సర్పంచులకు బిల్లుల అంశాలే కాంగ్రెస్ పార్టీకి కొరవి పెట్టబోతున్నాయని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు దమ్ముంటే ఈ 3 అంశాలపై ఎన్నికల్లోకి పోటీ చేయాలని సవాల్ విసిరారు.  హైడ్రా దుశ్చర్యలవల్ల రియల్ ఎస్టేట్ సంక్షోభంలో పడిందని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని తెలిపారు. ‘‘కాంగ్రెస్ పార్టీ హైడ్రా పేరుతో  ప్రజలతో ఆటలాడుతున్నది.  

ఏళ్ల తరబడి అన్ని అనుమతులు తీసుకుని, పన్నులు కడుతూ, బ్యాంకు లోన్లు తీసుకుని ఇండ్లు కట్టుకుంటే కూల్చి వేయడం ఎంత వరకు కరెక్ట్? హైడ్రా కూల్చివేతలవల్ల ప్రజలు కార్చిన కన్నీళ్లు మీకు గుర్తుకురావడం లేదా? ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరుతో మళ్లీ పేదల ఇండ్లను కూల్చేందుకు సిద్ధమైతున్నరు. జియాగూడలో దళిత సోదరులుండే ఇండ్లను కూల్చడానికి హైడ్రా వెళ్తది. చాదర్ ఘాట్ లో  ఉండే హిందువుల ఇండ్ల వద్దకు పోయి కూలగొడ్తమని బెదిరిస్తది. 

మరి ఎంఐఎం గూండాలు, ఒక వర్గం వాళ్లు మూసీని చెరబట్టి కట్టుకున్న ఇండ్లను, షెడ్లను, బిల్డింగులను ఎందుకు టచ్ చేయడం లేదు?” అని బండి సంజయ్ ప్రశ్నించారు.  ‘‘సీఎం రేవంత్​రెడ్డికి ఒవైసీ నిర్మాణాలను టచ్ చేసే దమ్ముందా? కనీసం మూసీ వెంట ఉన్న ముస్లింల ఇండ్లను కూలుస్తారా?” అని సవాల్​ చేశారు. రజాకార్ల ముఠా పార్టీ ఎంఐఎం ఉన్నంత కాలం ఓల్డ్ సిటీ న్యూ సిటీ కాలేదని, ఒక వర్గం ఓట్ల కోసం ఒవైసీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ సాగిలపడుతున్నయని విమర్శించారు. 

మూసీ సుందరీకరణ పెద్ద బోగస్​

మూసీ సుందరీకరణ అనేది పెద్ద బోగస్​అని బండి సంజయ్​అన్నారు. ‘‘గత 30 ఏండ్లనుంచి మూసీ బ్యూటిఫికేషన్​ మాటలు వింటూనే ఉన్నం. మూసీ ప్రక్షాళన పేరుతో ఒకసారి జపాన్ నిధులు తెచ్చిన్రు. ఇంకోసారి జమైకా నిధులు ఖర్చు చేసిన్రు. ఒకాయన ఏకంగా హుస్సేన్ సాగర్ ను కొబ్బరి నీళ్లలా మారుస్తానన్నడు. చివరకు ఏమైంది? అదే మూసీ, అదే కంపు. తెచ్చిన నిధులు మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల జేబుల్లోకి పోతే మూసీ కంపు బారిన పడి హైదరాబాద్ ప్రజలు రోగాలతో ఆసుపత్రి పాలైతున్నరు’ అని వ్యాఖ్యానించారు. 

జీతాలకే పైసల్లేక అల్లాడుతున్న రాష్టప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయకుండా చేతులెత్తేసిందని, మరి మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లు ఎక్కడినుంచి తీసుకొస్తుంది? అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత గెలిచిన సర్పంచులు, స్థానిక ప్రజా ప్రతినిధులందరితో కలిసి ‘ఛలో హైదరాబాద్’ పేరుతో మార్చ్ నిర్వహిస్తామని బండి సంజయ్ చెప్పారు. కాంగ్రెస్ మెడలు వంచి సర్పంచులకు బిల్లులు వచ్చేలా చేస్తామని చెప్పారు. పంచాయతీలకు నిధులు అందేలా బీజేపీ పోరాడుతుందని చెప్పారు. 

జగన్​ డిక్లరేషన్ ఇస్తే తప్పేంది?

 తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చే విషయంపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ రాద్ధాంతం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ‘‘ డాక్టర్ అబ్దుల్ కలాం రాష్ట్రపతి హోదాలో తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు డిక్లరేషన్ సమర్పించారని, జగన్ అంతకంటే ఎక్కువా?  దీనిపై రాజకీయాలెందుకు?  ఇవ్వకుంటే దేవుడిపై విశ్వాసం లేనట్లే. గతంలో జగన్ హిందువుల ఓట్ల కోసమే తిరుమల వెళ్లినట్టు అనిపిస్తున్నది” అని వ్యాఖ్యానించారు. దళితులకు తిరుమలలో అన్యాయం జరుగుతుందని చెప్పడం సిగ్గు చేటని పేర్కొన్నారు.

 దళితులే అసలైన హిందూ ధర్మ రక్షకులని చెప్పారు. దళితులపై లేనిపోని ప్రేమ ఒలకబోస్తూ క్రిస్టియన్లుగా మార్చే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. జగన్ తీరు చూస్తుంటే టీటీడీ లడ్డూ ప్రసాదంలో కల్తీ చేసినట్టు అనిపిస్తున్నదని చెప్పారు. ‘‘ఇది ముమ్మాటికీ హిందుత్వంపై జరుగుతున్న దాడిలో భాగమే. దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క హిందువుపై ఉంది’’ అని పేర్కొన్నారు.