- కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్ సిటీ, వెలుగు : జమ్మికుంట ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణ పనుల్లో ఏళ్ల తరబడి జాప్యం జరగడమేందని ఆర్వోబీ నిర్మాణాన్ని పూర్తి చేయడంలో మీకెందుకు చేతకావడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం రైల్వే అధికారులతో సమీక్షా నిర్వహించారు. 2016లో స్టార్ట్ అయిన ఉప్పల్ ఆర్వోబీ రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉండగా ఇంకెన్నాళ్లు సాకులు చెబుతారని అన్నారు.
మార్చిలోపు ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిందేనని లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. కరీంనగర్ లోని తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణంలో అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపైనా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
భూసేకరణ సమస్య ఉందని రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు కూడా మంజూరు కావడం లేదని అధికారులు వివరించారు. ఇన్ని రోజులు ఈ సమస్యలు తన దృష్టికి ఎందుకు తీసుకరాలేదని అన్నారు. తక్షణమే రైల్వే శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ ను ఆధునీకరించిమార్చిలోపు అందుబాటులోకి తీసుకొస్తున్నందున రైల్వే సిబ్బందిని అభినందించారు. కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే నిర్మాణ పనులను 2027 నాటికి పూర్తి చేయనున్నట్లు చెప్పారు. 60 కోట్లతో చేపట్టిన కొత్తపల్లి రైల్వే స్టేషన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. తీగలగుట్టపల్లి వద్ద రోడ్డు అధ్వాన్నంగా ఉండటంతో 36 లక్షల తో అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు.
ఈ నెల 11 నుంచి స్వదేశీ మేళా
కరీంనగర్ సిటీ, వెలుగు: స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో వచ్చే నెల 11 నుంచి 16 వరకు అంబేద్కర్ స్టేడియంలో జరగనున్న స్వదేశీ మేళా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు శుక్రవారం సాయంత్రం ఎంపీ కార్యాలయంలో స్వదేశీ మేళా బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా పెద్ద ఎత్తున స్వదేశీ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా స్వదేశీ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు .