రాహుల్​ గాంధీ హిందువు ఎట్లయితడు : బండి సంజయ్​

రాహుల్​ గాంధీ హిందువు ఎట్లయితడు : బండి సంజయ్​
  • రాజీవ్​ గాంధీ హిందువే కాదు.. ఆయన తండ్రి ఫిరోజ్ జహంగీర్ ఖాన్ పార్సీ: బండి సంజయ్​
  • ముస్లింలను బీసీ జాబితాలో కలిపి పంపితే.. కేంద్రం ఆమోదించేప్రసక్తే లేదు
  • నిరుద్యోగుల పక్షాన కోట్లాడింది బీజేపీయేన్న కేంద్ర మంత్రి

కరీంనగర్, వెలుగు: రాజీవ్ గాంధీ హిందువే కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. రాజీవ్ గాంధీ తండ్రి ఫిరోజ్ జహంగీర్ ఖాన్ పార్సీ మతస్తుడని, పర్షియాకు చెందిన వాళ్ల పూర్వీకులు ఇండియాకు వచ్చారని, ఫిరోజ్ జహంగీర్ ఖాన్ మతమే రాజీవ్ గాంధీకి వర్తిస్తుందన్నారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘స్వదేశీ మేళా’ ముగింపుకార్యక్రమం, పట్టణంలోని ఓ హోటల్ లో నిర్వహించిన సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో సంజయ్ పాల్గొని మాట్లడారు. 

తండ్రి కులమే కొడుకుకు వర్తిస్తుందని, రాజీవ్ గాంధీ హిందువు అయినందున ఆయన కుమారుడు రాహుల్ గాంధీ కూడా హిందువేనని కాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరమన్నారు. రాహుల్ గాంధీ కుటుంబానికి కులం, మతం, జాతి, దేశం లేదని, కానీ మోదీ పక్కా ఇండియన్ అన్నారు. 

బీసీ కుల గణన పేరుతో హిందువులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని, ఒక వర్గానికి, మతానికి కొమ్ము కాసేందుకు కాంగ్రెస్ నేతలు బీసీల జనాభా తగ్గించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 10 శాతమున్న ముస్లింలను బీసీల్లో కలిపారని, 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నా.. అందులో 10 శాతం ముస్లింలకే చెందుతాయన్నారు. మహారాష్ట్రలో మాదిరిగా మత మార్పిడులు, లవ్ జిహాదీలపై ఇక్కడ కూడా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ముస్లింలను బీసీ జాబితాలో కలిపి కేంద్రానికి పంపితే.. ఆ జాబితాను కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిందేమిటి?

టీచర్, గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి అర్హతే లేదని, నిరుద్యోగుల పక్షాన ఉద్యమించింది, పోరాడింది బీజేపీయేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. టీచర్లు, గ్రాడ్యుయేట్ల పక్షాన ఏనాడైనా పోరాటాలు చేశారా అని ప్రశ్నించారు. ‘‘317 జీవోకు వ్యతిరేకంగా ఎన్నడైనా కేసీఆర్ సర్కార్ తో కొట్లాడారా? గ్రూప్1 సహా నిరుద్యోగుల పక్షాన ఎన్నడైనా జైలుకు వెళ్లారా? మరి కాంగ్రెస్ అభ్యర్థులకు ఎందుకు ఓట్లేయాలి? టీచర్లు, నిరుద్యోగుల సమస్యలపై నిరంతరం కొట్లాడింది, జైలుకు వెళ్లిన, లాఠీదెబ్బలు తిన్న చరిత్ర బీజేపీదే’’ అని అన్నారు. 

ఈ విషయాలన్నీ ప్రజలకు వివరించి బీజేపీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని కోరుతున్నానని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఎన్వీఎస్ ప్రభాకర్, సునీల్ రావు, గంగాడి కృష్ణారెడ్డి, సంగప్ప తదితరులు పాల్గొన్నారు.