హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ను పోలీసులు అడ్డుకోవడంతో లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రూప్ 1 పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థులకు మద్దతుగా ఆందోళన చేస్తున్న బండి సంజయ్ సచివాలయానికి ర్యాలీగా బయల్దేరి ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ నిరసనను పోలీసులు భగ్నం చేశారు. తనను అడ్డుకోవడంతో బండి సంజయ్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి వాస్తవాలను వివరించేందుకే వెళ్తున్నామని ఈ సందర్భంగా బండి చెప్పారు.
ALSO READ| సికింద్రాబాద్లో తీవ్ర ఉద్రిక్తత.. ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం
జీవో 29ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండిపట్టు వీడాలని, అభ్యర్థులపై పోలీసులు లాఠీ ఝుళిపించడం సరికాదని బండి సంజయ్ చెప్పారు. పోలీసులు నిలువరించినప్పటికీ సచివాలయానికి వెళ్లి తీరుతామని ఆయన చెప్పడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రూప్ 1 అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనను కొనసాగించారు. బండి సంజయ్ను తరలిస్తున్న వాహనానికి గ్రూప్ 1 అభ్యర్థులు ఎక్కడికక్కడ అడ్డు తగిలారు. బండి సంజయ్ ఆందోళనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి ఫోన్ చేసి మాట్లాడారు. జీవో29పై చర్చకు రావాలని ఆహ్వానించారు.
దివ్యాంగుల రిజర్వేషన్లో మార్పులు చేస్తూ గ్రూప్-1 పరీక్షకు ముందు ప్రభుత్వం జీవో 29ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం.. ఉన్నత కులాల అభ్యర్థులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా ఉందని, బీసీ,ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని కొందరు విద్యార్థులు ఆందోళనలకు దిగారు. సింపుల్గా చెప్పాలంటే.. ఓపెన్ కేటగిరి అభ్యర్థులు మాత్రమే ఉద్యోగం పొందేలా ఈ జీవో ఉందనేది కొందరు విద్యార్థుల వాదన.