గద్దర్ ఒక మాజీ నక్సలైట్.. ఆయనకు పద్మ అవార్డ్ ఎలా ఇస్తారు..? కేంద్రమంత్రి బండి సంజయ్

గద్దర్ ఒక మాజీ నక్సలైట్.. ఆయనకు పద్మ అవార్డ్ ఎలా ఇస్తారు..? కేంద్రమంత్రి బండి సంజయ్

కరీంనగర్: ప్రజా యుద్ధ నౌక గద్దర్‎కు పద్మ అవార్డ్ ఇవ్వకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న విమర్శలకు కేంద్రమంత్రి, బీజేపీ కీలక నేత బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఎంతో మంది బీజేపీ కార్యకర్తలను, ఎన్ కౌంటర్లలో పోలీసులను పొట్టన బెట్టుకున్న వ్యక్తి గద్దర్ అని.. అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మావోయిస్టుగా పని చేసి ఎంతో మంది ప్రాణాలు తీసిన వారిలో గద్దర్‎ ఒకరని.. ఆయనకు పద్మ అవార్డు ఇచ్చేదే లేదని కుండబద్దలు కొట్టారు.

సోమవారం (జనవరి 27) కరీంనగర్లో బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ నక్సలైట్ కాదన్నారు. మావోయిస్టు భావజాలం వేరు.. నక్సలైట్‎గా పని చేయడం వేరని పేర్కొన్నారు. నక్సలిజంతో ఎంపీ ఈటల రాజేందర్‎కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. 

ALSO READ | పక్క రాష్ట్రానికి 5 ఇచ్చినప్పుడు మాకు కనీసం నాలుగైనా ఇవ్వాలి కదా? : రేవంత్

అలాగే.. నంది అవార్డుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న గద్దర్ అవార్డులు మా వాళ్ళు తీసుకోరని బండి సంజయ్ స్పష్టం చేశారు. గద్దర్ కాంగ్రెస్, టీడీపీకి చెందిన నేతలను హతమార్చారని.. ఆ విషయం సీఎం రేవంత్ రెడ్డికి తెల్వదని అన్నారు. గద్దర్‎కు వ్యతిరేకంగా మాట్లాడానని.. నా దిష్టి బొమ్మ తగలబెడితే నా ఆయుష్షే పెరుగుతుందని సెటైర్ వేశారు కేంద్రమంత్రి బండి సంజయ్.