ముస్లింలను బీసీల్లో ఎట్ల చేరుస్తరు? : బండి సంజయ్

ముస్లింలను బీసీల్లో ఎట్ల చేరుస్తరు? : బండి సంజయ్
  • ఒవైసీ, రేవంత్ కలిసి బీసీలను దెబ్బతీసే కుట్ర: బండి సంజయ్
  • బీసీ సంఘాలన్నీ ఏం చేస్తున్నాయంటూ మండిపాటు

నల్గొండ, వెలుగు: ముస్లింలను బీసీ జాబితాలో ఎలా చేరుస్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. హిందువులకు, ముస్లింలకు పోలికేంటని మండిపడ్డారు. ఇంత జరుగుతుంటే బీసీ సంఘాలన్నీ ఏం చేస్తున్నాయని నిలదీశారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల వంతపాడుడేనా అంటూ ఎద్దేవా చేశారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు బీసీ స్థానాల్లో ముస్లింలు పోటీ చేయడంతో బీసీలకు అన్యాయం జరిగిందని గుర్తుచేశారు.

అప్పుడు హిందుత్వ వాదులు, బీసీ సంఘాలు స్పందించకపోవడం వల్లే ఇప్పుడు ఒవైసీ, రేవంత్ గ్యాంగ్ కలిసి బీసీలను దెబ్బతీసే కుట్రకు తెరలేపాయన్నారు. అగ్రకులాల ప్రజలు కూడా బీసీలకు జరిగిన అన్యాయంపై సానుభూతి తెలుపుతుంటే.. బీసీ సంఘాలు ఎందుకు నోరుమూస్కుని ఉన్నాయంటూ ఫైర్ అయ్యారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోనూ ముస్లింలు పోటీ చేస్తారని, వాళ్ల ఆధిపత్యమే కొనసాగుతుందని అన్నారు.

బీసీలతోపాటు హిందువులంతా ఏకమై కాంగ్రెస్​కు గుణపాఠం చెప్పాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చిన బండి సంజయ్.. పార్టీ కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కార్యశాలలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ సర్కార్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో 51 శాతం బీసీల జనాభా ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కుల గణన సర్వేలో బీసీ జనాభా 46 శాతానికి ఎలా పడిపోయిందని ఆయన ప్రశ్నించారు.

ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని బండి సంజయ్ ఆరోపించారు. కాళేశ్వరం, డ్రగ్స్, ఫార్ములా ఈ రేస్ సహా పలు అవినీతి కేసుల్లో బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయకుండా చూసేలా కాంగ్రెస్, అందుకు ప్రతిఫలంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టకుండా కాంగ్రెస్​ను గెలిపించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేస్తున్నాయని ఆరోపించారు.

ఇలాంటి పార్టీకి ఎందుకు ఓటెయ్యాలి?

ఉద్యోగుల రిటైర్​మెంట్ కాలాన్ని 65 ఏండ్లకు పొడిగించి కాంగ్రెస్ సర్కారు నిరుద్యోగుల భవిష్యత్తును నాశనం చేస్తోందని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు జీపీఎప్​లో దాచుకున్న సొమ్మును కూడా ఇవ్వకుండా సతాయిస్తోందన్నారు. అలాంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి రూ. 4 వేల ఇస్తామని 14 నెలలైందని, ఈ లెక్కన ప్రతి నిరుద్యోగికి కాంగ్రెస్ సర్కారు రూ.56 వేలు బాకీ పడిందని అన్నారు.

తొలి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి, 25 వేల ఉద్యోగాలకే  నోటిఫికేషన్ ఇచ్చిందని, 50 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తప్పుడు ప్రచారం చేసుకుంటోందని సంజయ్ మండిపడ్డారు. లక్షలాది మంది పిల్లలకు ఫీజు రీయింబర్స్​మెంట్ అందలేదన్నారు. రెండో పీఆర్సీ అమలు చేయకుండా గత బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ఉద్యోగులను మోసం చేసిందన్నారు.

‘‘స్కూళ్లలో చాక్​పీసులకు పైసల్లేవ్, టాయిలెట్లు కడగడానికి స్కావెంజర్లు లేరు, ఆఖరికి విద్యాశాఖకు మంత్రి లేరు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటెయ్యాలి’ అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్ర బడ్జెట్​లో అన్యాయం జరిగిందంటున్న కాంగ్రెస్​ ఆరోపణలు అవాస్తవమని అన్నారు. సమావేశంలో కాసం వెంకటేశ్వర్లు, గొంగిడి మనోహర్ రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, శ్రీధర్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, నాగం వర్షిత్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.