
- ఇదే జరిగితే నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశలు గల్లంతేనని వ్యాఖ్య
వరంగల్, వెలుగు: ‘‘మాజీ సీఎం కేసీఆర్ తన ప్రభుత్వంలో ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకనే పదవీ విరమణ వయసును 59 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు పెంచిండు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉద్యోగుల వయసును 61 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు పెంచే ఆలోచన చేస్తున్నడు. అలా చేస్తే నిరుద్యోగులకు ఇక ఉద్యోగాలు రావు”అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.
ఆదివారం వరంగల్‌లోని బొల్లికుంట వాగ్దేవి కాలేజీలో బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి తరఫున ప్రచారం చేసి, మాట్లాడారు. ‘‘కాంగ్రెసోళ్లకు టీచర్ అభ్యర్థులు ఎవరూ దొరకలే. బీఆర్‍ఎస్‍లో కేసీఆర్ ఫొటో పెట్టుకుని పోటీ చేయడానికి కూడా ఎవరూ రావట్లే. గ్రాడ్యుయేట్స్‌లో కాంగ్రెసోళ్లు ఇద్దరు పోటీ చేస్తున్రు. ఒకాయన గెల్వక ముందే కాంగ్రెస్‌లోకి పోతానంటుండు.
బీజేపీ అభ్యర్థి తప్ప మిగతా 18 మందిలో ఎవరూ గెలిసినా కాంగ్రెస్‌లోకి వెళ్తారు” అని పేర్కొన్నారు. కాగా, రైతులు, మహిళలు, నిరుద్యోగుల కోసం బీజేపీ కొట్లాడితే.. కాంగ్రెసోళ్లకు ఓట్లు వేశారని, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క ఎప్పుడైనా ఉద్యమాలు చేశారా, జైలుకెళ్లారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. తాను కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ.. తనపై 109 కేసులు ఉన్నాయన్నారు. ఇవన్నీ తన కుటుంబం కోసం కాకుండా ప్రజల కోసం కొట్లాడినవేనని పేర్కొన్నారు.