నిజామాబాద్: పసుపు రైతుల జీవితాల్లో కొత్త కాంతులు రాబోతున్నాయని కేంద్ర సహయ మంత్రి బండి సంజయ్ అన్నారు. 2025, జనవరి 14న నిజామాబాద్‌లో ఏర్పాటు చేయనున్న జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి బండి సంజయ్ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సంద్భరంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేసిన ఘనత బీజేపీదేనని అన్నారు. తన పార్లమెంట్ పరిధిలో జాతీయ పసుపు బోర్డును సాధించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు అభినందనలు తెలిపారు.
పసుపు బోర్డు ఏర్పాటుకు సహకరించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ధన్యవాదాలు చెప్పారు. పసుపు బోర్డు వల్ల ఈ ప్రాంత రైతులకు అనేక ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ఇకపై పసుపు రైతులకు గిట్టుబాటు సమస్యే ఉండదన్నారు. పసుపు బోర్డుకు కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిజామాబాద్‌లో బోర్డు సాధనకు పోరాడిన పసుపు రైతులందరికీ ఈ సందర్భంగా బండి సంజయ్ హ్యాట్సాఫ్ చెప్పారు. కాగా, నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు 2025, జనవరి 13న కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ALSO READ | కౌశిక్ రెడ్డి.. ఇప్పటికైనా తీరు మార్చుకో: TPCC చీఫ్ మహేష్ గౌడ్
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని 2025, జనవరి 14న నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రారంభోత్సవం చేశారు. అలాగే.. నిజామాబాద్‌కు చెందిన బీజేపీ నేత పల్లె గంగారెడ్డిని జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి ఆయన మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామానికి చెందిన రైతు పల్లె గంగారెడ్డి ప్రస్తుతం బీజేపీలో సీనియర్ నేతగా, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు.