హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో చదివింది.. ఆర్థిక బడ్జెటా లేక అప్పుల పత్రామా అని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. అప్పులున్నాయనే పేరుతో హామీలను అమలు చేయలేమని చేతులెత్తేస్తున్నారా అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అప్పులున్న విషయం తెలిసినా ఆరు గ్యారంటీలిచ్చారని, వాటికి ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు. గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం అంతే నిజమనే దానికి బడ్జెట్ నిదర్శనమన్నారు.
ఆరు గ్యారంటీలు సహా హామీల అమలుపై చర్చ జరగకుండా ఉండేందుకు కేంద్రాన్ని బద్నాం చేయాలనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. 12 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చిన కాంగ్రెస్, 31 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పడం నిరుద్యోగులను మోసం చేయడమేనని అన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ పేరు రాలేదని, రాష్ట్రానికి ఘోర అన్యాయం అంటూ ప్రజలను రెచ్చగొట్టిన కాంగ్రెస్ నేతలు రాష్ట్ర బడ్జెట్ లో ఏ ఒక్కజిల్లా, నియోజకవర్గం ప్రస్తావన చేయలేదు కదా.. దీనికేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.