- కవిత బెయిల్పై కేంద్ర మంత్రి బండి సంజయ్
- కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనమే తరువాయి అని కామెంట్
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ఇది బీఆర్ఎస్, కాంగ్రెస్ సమిష్టి విజయమని ప్రకటించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. “కాంగ్రెస్ పార్టీకి, వారి లాయర్లకు కంగ్రాట్స్. కవితకు బెయిల్ ఇప్పించడంతో విజయం సాధించినందుకు అభినందనలు. మీ అవిశ్రాంత కృషి చివరికి ఫలించింది” అంటూ పోస్టు చేశారు.
బీఆర్ఎస్ నేత బెయిల్ పై బయటకు వచ్చారనీ, కాంగ్రెస్ నాయకుడు రాజ్యసభలోకి వెళ్తున్నారని పోస్టులో పేర్కొన్నారు. “కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్.. బెయిల్ కోసం వాదించిన అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం.. అధికార కాంగ్రెస్ ఏకపక్షంగా రాజ్యసభకు నామినేట్ చేయడం.. ఈ క్విడ్ ప్రోకో నేరంలో పాలు పంచుకున్న భాగస్వాములకు అభినందనలు..”అంటూ పేర్కొన్నారు.
విలీనం మాటముచ్చట పూర్తయిందని, ఇక అప్పగింతలే తర్వాయి అంటూ ఎద్దేవా చేశారు. కాగా, ఈ పోస్టుపై సుప్రీంకోర్టు తీర్పును సంజయ్ వ్యతిరేకించారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ కౌంటర్ ఇవ్వగా.. బండి సంజయ్ పోస్టులో తప్పేమీ లేదని బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, పాయల్ శంకర్ సమర్థించారు. కేటీఆర్ చదువుకున్న ముర్ఖుడు అని, త్వరలోనే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కావడం తథ్యం అని రాజాసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.