
- కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్కు బండి సంజయ్ వినతి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని శాతవాహన యూనివర్సిటీకి ‘లా కాలేజీ’ని మంజూరు చేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో వర్సిటీ వీసీ, మాజీ మేయర్లతో కలిసి ఆయన కేంద్ర మంత్రి మేఘ్వాల్కు వినతి పత్రం సమర్పించారు.
దాదాపు అరగంట పాటు సాగిన ఈ భేటీలో శాతవాహన వర్సిటీ అందిస్తోన్న కోర్సులు, ఇతర అంశాలను వివరించారు. కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ తమ విజ్ఞప్తి పై సానుకూలంగా స్పందించారని బండి సంజయ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచే కోర్సులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించినట్టు పేర్కొన్నారు.