బూతులు తిట్టేవాళ్ల నోటీసులకు విలువ ఉంటదా : బండి సంజయ్​

బూతులు తిట్టేవాళ్ల నోటీసులకు విలువ ఉంటదా : బండి సంజయ్​
  • కేటీఆర్ నోటీసులకు బదులిచ్చిన.. క్షమాపణ చెప్పకుంటే నేనూ ఇస్త: బండి సంజయ్​
  • బీఆర్ఎస్​ను నామరూపాలు  లేకుండా భూస్థాపితం చేస్తం
  • తెలంగాణలో హెచ్​ఆర్​కే సర్కారు నడుస్తున్నది
  • బావా బామ్మర్దులిద్దరూ పోటీపడి రేవంత్​కు సహకరిస్తున్నరని కామెంట్​

హైదరాబాద్, వెలుగు:  తనకు కేటీఆర్​ పంపిన లీగల్​ నోటీసులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్​ స్పందించారు. బూతులు తిట్టేటోని నోటీసులకు విలువ ఉంటదా? అని కేటీఆర్ నుద్దేశించి వ్యాఖ్యానించారు.  తెలంగాణలో హెచ్​ఆర్​కే (హరీశ్​రావు, రేవంత్​, కేటీఆర్​) సర్కారు నడుస్తున్నదని, బావబామ్మర్దులిద్దరూ (హరీశ్​రావు, కేటీఆర్​) రేవంత్ రెడ్డికి పోటీపడి సహకరిస్తున్నారని అన్నారు. అందుకే కేటీఆర్ బామ్మర్ది ఫాంహౌస్​ కేసును నీరుగారుస్తున్నారని  ఆరోపించారు. విశాఖపట్నంలో బీజేపీ శాసనసభాపక్ష నేత, విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును బండి సంజయ్ మంగళవారం కలిశారు. 

ఈ సందర్భంగా సంజయ్​ మీడియాతో మాట్లాడారు.  కేటీఆర్ పంపిన లీగల్​ నోటీసులకు బదులిచ్చానని, తిరిగి తానూ నోటీసులు ఇవ్వనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే దాకా కాంగ్రెస్ ను వెంటాడుతామని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను నామరూపాల్లేకుండా భూస్థాపితం చేస్తామని వెల్లడించారు. 

కేటీఆర్ క్షమాపణ చెప్పకుంటేచట్టపరంగా చర్యలు 

బీఆర్ఎస్ నేత కేటీఆర్​ తనపై చేసిన వ్యాఖ్యలపై 7 రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని  బండి సంజయ్ డిమాండ్​ చేశారు. లేకుంటే తాను లీగల్​ గా ముందుకెళ్తానని చెప్పారు.  కేటీఆర్ ఇచ్చిన లీగల్ నోటీసుపై బండి సంజయ్  తన లాయర్ ద్వారా సమాధానం ఇచ్చారు. తనకు ఇచ్చిన లీగల్ నోటీసులోని అంశాలన్నీ అవాస్తవాలేనని, తనపై తప్పుడు ఆరోపణలు చేశారని లేఖలో పేర్కొన్నారు. రాజకీయ విమర్శలకు లీగల్ నోటీసులు ఇవ్వడాన్ని సంజయ్​ తప్పుపట్టారు.  తాను ఎలాంటి లీగల్ నోటీసులకు భయపడబోనని అన్నారు.

 కేటీఆర్ పై తాను ఉద్దేశపూర్వక, వ్యక్తిగత ఆరోణలు చేయలేదని తెలిపారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్  పేర్కొన్నారు. ఈ నెల19న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎక్కడా కేటీఆర్​ పేరును తాను ప్రస్తావించలేదని తెలిపారు.  గత ప్రభుత్వం  గ్రూప్– 1 నిర్వహించడంలో విఫలమైందనే అంశంపై చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవి కావని అన్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న తనకున్న వాక్ స్వాతంత్ర్యం మేరకు మాట్లాడినట్టు చెప్పారు. వారం రోజుల్లో తనకు ఇచ్చిన లీగల్ నోటీసులు వెనక్కి తీసుకోవాలని, లేదంటే న్యాయపరంగా ముందుకెళ్తామని బండి సంజయ్ వెల్లడించారు.

8 లక్షల కొలువులు భర్తీ చేసినం

​మోదీ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు 10 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నదని, ఇప్పటికే దాదాపు 8 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందని బండి సంజయ్​ తెలిపారు. ‘‘కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ పాలన కొనసాగుతున్నందున గతంతో పోలిస్తే ఏపీని రెట్టింపు స్థాయిలో అభివృద్ధి చేసుకునే అవకాశాలున్నాయని తెలిపారు. విశాఖపట్నంలో మంగళవారం నిర్వహించిన ‘రోజ్ గార్ మేళా’ కార్యక్రమానికి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 110 మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్​ ఇండియా పేరుతో దేశంలో అన్ని రంగాల్లో దూసుకుపోతున్నామని సంజయ్ తెలిపారు.  ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నదని అన్నారు. అమరావతి డెవలప్​మెంట్ కోసం రూ.15వేల కోట్లు ఇవ్వబోతున్నామన్నారు.